“యూట్యూబ్ ఒరిజినల్స్” ప్రారంభం!

హాట్‌స్టార్, జియో సినిమా, అమేజాన్ ప్రైం వంటి వీడియో స్ట్రీమింగ్ సర్వీసుల హవా పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ కూడా పెయిడ్ ప్లాట్ఫాం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఫ్రీ వీడియో సర్వీసులు అందుబాటులో వున్నా, ప్రత్యేక సిరీస్లు, సినిమాలను అందుబాటులో వుంటే వినియోగదారులు సైతం పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి మొగ్గుచూప్తున్నారు. తాజాగా యూట్యూబ్ కూడా “యూట్యూబ్ ఒరిజినల్స్” పేరిట కొత్త సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. మొదటిగా ప్రముఖ సంగీత దర్శకుడు AR Rahman తో “ARRivals” పేరిట ఒక సిరీస్‌తో ముందుకు రాబోతోంది.

గతేడాది హిందీ భాషలో ‘అన్-క్రికెట్’ పేరిట విడుదల చేసిన ప్రత్యేక సిరీస్ అంచనాలకు మించి ప్రాముఖ్యత పొందిన విషయం తెలిసిందే. అప్పుడే యూట్యూబ్ సంస్థ పెయిడ్ మార్కెట్ వైపు రావాలని నిర్ణయించింది. ప్రతీ యేటా యూట్యూబ్ వినియోగదారులు 100% రెట్టింపు రేటుతో కొనసాగుతూ వస్తున్నారు. మనదేశంలో డిజిటల్ సేవలు గత కొద్ది కాలంగా భారీ స్థాయిలో పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలన్నీ భారతదేశాన్ని టార్గెట్ చేస్తూనే అనేక అప్ప్లికేషన్లు, మార్కెట్ సర్వీసులనూ మొదలుపెడుతున్నాయి.

ఇప్పటికే యూట్యూబ్‌లో అనేక సినిమాలు పెయిడ్ వర్షన్లో ఉన్నప్పటికీ అవి వాస్తవంగా సరైన రేట్లలో లేనందున, ఇతర చోట్ల అందుబాటులో వున్నందున వాటిని చూడటానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు ప్రకటించిన “యూట్యూబ్ ఒరిజినల్స్” కూడా ప్రస్తుతానికి అందరికీ ఉచితంగానే ప్రకటనలతో లభిస్తుంది. భవిష్యత్తులో అమేజాన్ ప్రైం మాదిరిగా పెయిడ్ సబ్స్క్రిప్షన్లను కూడా మొదలుపెట్టనున్నట్లు తెలిపింది యూట్యూబ్ సంస్థ.

Leave a Reply