టెక్నాలజీ వార్తలు

ఆధార్ నంబర్‌ను కూడా ఎవరికీ తెలియనివ్వొద్దట!

ఇటీవలె TRAI (టెలికం నియంత్రణ అధికార సంస్థ) ముఖ్యాధికారి ఆర్.ఎస్.శర్మ ట్విట్టర్‌లో తన ఆధార్ 12 అంకెలను ప్రచురించి హ్యాకర్లకు ఛాలెంజ్ విసిరారు. తన 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఇక్కడ వుంచుతున్నానని, దీని వల్ల హ్యాకర్లు ఏం చేస్తారో తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.  దీనికి బదులుగా చాలామంది నెటిజన్లు ఈ ఆధార్ 12 అంకెలను ఉపయోగించి మీ మొబైల్ పోయిందని టెలికాం వాళ్ళకు ఫిర్యాదు చేసి బ్లాక్ చేయించామని, అనేక ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో పూర్తి వివరాలు ఆధార్ డేటాబేస్ నుండి పొంది రిజిస్టర్ అవ్వగలిగామని వాటిద్వారా Cash on Delivery ఆర్డర్లు కూడా పెట్టమనీ బదులిచ్చారు. కొంతమందైతే మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసామనీ, తనిఖీ చేసుకొమ్మని బదులిచ్చారు.

దీనికి సంబంధించి వివరణ కోరగా ఇవన్నీ అవాస్తవాలని ఆర్.ఎస్.శర్మ మీడియాతో తెలిపారు. కాగా తాజాగా ఆధార్ సంస్థ అయిన UIDAI (Unique Identification Authority of India) ఆధార్ నంబర్‌ను ఇతరులకు తెలియజెప్పడం, సామాజిక మాధ్యమాల్లో భాగస్వామ్యం చేయడం లాంటి చర్యలు చట్టబద్ధం కావని తెలిపింది.

అంతేకాక ఒకరు వేరొకరి ఆధార్ నంబర్‌ను ఉపయోగించడానికి (Authentication) ప్రయత్నిస్తే వారు కూడా ఐపీసీ (ఇండియన్ పెనల్ కోడ్) మరియు ఆధార్ యాక్టు ప్రకారం చట్టరీత్యా నేరస్థులగా పరిగణించబడతారని హెచ్చరించిది. ఆధార్ అనేది ఒక వ్యక్తి తన గుర్తింపును అనేక ప్రభుత్వ, ప్రైవేటు సేవలకసం ఉపయోగించే సాధనంగా మాత్రమే ఉపయోగించాలని, పబ్లిక్‌గా అందరికీ తెలుపకూడదనీ తెలిపింది.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో కూడా ఆధార్ సంఖ్యను నేరుగా తెలుపడం వల్ల దుర్వినియోగమయ్యే అవకాశం వున్నందున ఇటీవలె UIDAI సంస్థ ఆధార్ నంబర్‌కు Virtual ఆధార్ నంబర్‌ను ప్రవేశపెట్టింది. దీనిద్వారా మీ 12 అంకెల ఆధార్ నంబర్‌కు వర్చువల్‌గా వేరొక 12 అంకెలు ఇవ్వబడతాయి. ఆధార్‌ను వినియోగించే ఎక్కడైనా ఈ కొత్తగా ఇచ్చిన 12 అంకెలను ఇవ్వవచ్చు, ఇవి మీ ఆధార్‌కే జతపరచబడి వున్నా మూడో వ్యక్తికి మీ వివరాలేవీ తెలియవు.

ఆధార్ యాక్టు, సమాచార శాఖ నియమాల ప్రకారం కూడా సున్నితమైన వివరాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచకూడదని హెచ్చరించింది. సో, ఇక మీదట మీ ఆధార్ నంబర్‌ను ఎవరికీ చెప్పకండి. కొత్త సిం కార్డులు తీసుకునేటప్పుడు, ఇతర అవసరాలకు కూడా Virtual Aadhaar IDను వాడటం మంచిది. ఈ ఐడీను ఆధార్ అధికారిక వెబ్‌సైటు నుండి పొందవచ్చు.

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment