తెలుగు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశం

స్టాక్ మార్కెట్ సిరీస్: 1. ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

గమనిక: ఈ చాప్టర్ ‘స్టాక్ మార్కెట్ సిరీస్’ లో భాగంగా రాయబడింది.  కొత్తగా చదువుతున్నవారు ఈ లింక్ లోకి వెళ్లి మొదటి చాప్టర్ నుండి చదవవచ్చు.

పెట్టుబడి (Investment) ఎందుకు పెట్టాలో తెలుసుకునేముందు, పెట్టుబడి పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.  ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ.50,000 సంపాదించగా అందులో 30వేలు ఖర్చులకుపోగా 20వేలు మిగులుతాయి అనుకుందాం.  ఇది ఉదాహరణే కాబట్టి ఆదాయపు పన్ను తదితర అంశాలను ప్రస్తావించడం లేదు. మరికొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుందాం:

 • ఈ వ్యక్తీ సాలరీ సంవత్సరానికి 10% పెరుగుతుంది.
 • ప్రతీ సంవత్సరం జీవన వ్యయం (Cost of Living) 8% పెరుగుతూ ఉంటుంది.
 • ఈ వ్యక్తికి ప్రస్తుతం 30 సంవత్సరాలు, తన 50వ ఏట రిటైర్ అవుతాడు.  అంటే ఇంకా అతను 20 సంవత్సరాలు సంపాదిస్తాడు.
 • రిటైర్ అయిన తర్వాత పని చేయాలని అతను అనుకోవడం లేదు.
 • ఇతని నెలవారీ ఖర్చులు ఫిక్సిడ్ గా ఉన్నాయి, కొత్త ఖర్చులేమీ లేవు.
 • ఇతని దగ్గర నెలవారీ మిగిలే 20,000 డబ్బు రూపంలో ఉంచుకుంటున్నాడు.

ఒక 20 సంవత్సరాలు ఇతను పైన అనుకున్న విధంగానే బ్రతికితే, 20 సంవత్సరాల తరువాత అతని దగ్గర ఇంత డబ్బు ఉంటుంది:

ఈ టేబుల్ ను పరిశీలిస్తే ఇతని భవిష్యత్తులో ఎలా బ్రతకబోతున్నాడో అర్థమవుతుంది.

 • 20 సంవత్సరాలు కష్టపడిన తరువాత ఇతని దగ్గర రూ.1 కోటి 78 లక్షలు మాత్రమే మిగులుతాయి.
 • ఇతను ఈ 20 సంవత్సరాలూ నెలకు 30 వేలు ఫిక్సిడ్ గా ఖర్చు చేయడం వల్ల చాలా సార్లు ఖర్చులకు వెనకాడుతూనే బ్రతికాడు.  కారు, సొంత ఇల్లు, వేకేషన్లు లాంటివేమీ లేకుండానే బ్రతికాడు.
 • ఈ 20 సంవత్సరాలు ఖర్చులు 8% పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అతను ఆదా చేసిన 1.78 కోట్లతో ఈ 20 సంవత్సరాలు ఫిక్సిడ్ గా బ్రతికినట్లే మరొక 8 సంవత్సరాలు బ్రతకగలడు!  8 సంవత్సరాల తరువాత అతని పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతోంది!
 • ఈ 8 సంవత్సరాలు తరవాత అతనేం చేస్తాడు!? డబ్బు ఎలా వస్తుంది? అతను ప్రస్తుతం 20 సంవత్సరాలు పనిచేయగలడు.  ఈ 20 సంవత్సరాలలో డబ్బు దాచుకోవడం వల్ల రిటైర్ అయిన తరువాత 8 సంవత్సరాలు డబ్బుకు డోకా లేదు. మరి తరువాత?
 • ఈ 20 సంవత్సరాలలోనే ఇంకా మెరుగ్గా డబ్బు ఆదా చేసుకునే అవకాశాలను పరిశీలిద్దాం.

ఇప్పుడు అతని దగ్గర ఉన్న 20 వేల డబ్బును డబ్బు రూపంలో అలాగే దాచుకోవడం కాకుండా, ఎక్కడైనా సంవత్సరానికి 12% రిటర్న్ వచ్చేలా పెట్టుబడి పెట్టాడనుకుందాం.  అంటే అతని దగ్గర నెలకు మిగిలే డబ్బును 12% రిటర్న్ వచ్చేలా 20 సంవత్సరాలు పెట్టుబడి పెడితే, 20 సంవత్సరాల తరువాత అదే డబ్బు ఇలా పెరుగుతుంది:

పెట్టుబడి చేయడం వల్ల అతని డబ్బు 20 సంవత్సరాల తరువాత 4.26 కోట్లుగా మారింది. ఏ పెట్టుబడీ చేయకుండా డబ్బు రూపంలో దాచుకుంటే 20 సంవత్సరాల తరువాత 1.78 కోట్లే ఉండేది. అంటే పెట్టుబడి చేయకపోతే 2.56 కోట్లు నష్టం! పెట్టుబడి చేయడం వల్ల ఇదివరక్కంటే మెరుగ్గా అతని మిగతా జీవితాన్ని జీవించగలడు.

ఇప్పుడు మన టాపిక్ కు వద్దాం. ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

 1. ద్రవ్యోల్భణం (Inflation – అంటే కొంత కాలానికి ఆర్ధిక వ్యవస్థలో వస్తువులు మరియు సేవల సాధారణ ధరల స్థాయి పెరగడం) ను – సింపుల్ గా ధరల పెరుగుదలను ఎదుర్కోవడం కోసం పెట్టుబడి చేయాలి.
 2. డబ్బును సృష్టించడం కోసం – పెట్టుబడి చేయడం వల్ల మనం అనుకున్న సమయ వ్యవధిలో అనుకున్న డబ్బును సృష్టించడం కోసం. పైన అంచనాలు రిటైర్మెంట్ తరువాత ఎలా అన్న దాని గురించి వేసిన అంచనా. కానీ పెట్టుబడి దేనికోసమైనా అవ్వొచ్చు కదా – అది పిల్లల చదువులకోసం కావచ్చు, పెళ్లి కోసం కావచ్చు, ఇల్లు కోసం కావచ్చు వేరేదైనా కావచ్చు.
 3. ఆర్థికపరంగా ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం.

ఎక్కడ పెట్టుబడి చేయాలి?

ఎక్కడ పెట్టుబడి చేయాలి అనేది పెట్టుబడి చేయాలనుకునేవారిపై ఆధారపడి ఉంటుంది.  ఎంత రిటర్న్ ఆశిస్తున్నాం, రిస్క్ మానేజ్మెంట్ ని బట్టి ఉంటుంది.  పెట్టుబడి ఎక్కడ చేస్తామో దానిని బట్టి రిస్క్ ఉంటుంది.  పెట్టుబడి చేయడానికి 4 ‘ఆస్తి తరగతులు’ (Asset Classes) ఉన్నాయి.

 1. ఫిక్సిడ్ ఇన్కం స్కీమ్స్
 2. ఈక్విటీ మార్కెట్స్ (స్టాక్/షేర్ మార్కెట్)
 3. రియల్ ఎస్టేట్
 4. కమోడిటీస్

(ఈ పదాల గురించి కూడా తరువాత వచ్చే టాపిక్స్ లో వివరణ ఇస్తాను. ఈ టాపిక్ లో వాటి గురించి మామూలుగానే వివరణ ఇవ్వడం జరిగింది.)

1. ఫిక్సిడ్ ఇంకం స్కీమ్స్:

ఈ ఫిక్సిడ్ ఇన్కం స్కీమ్స్ లో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది (పెట్టుబడి తక్కువ రిస్క్ తో చేయాలనుకునేవారు ఈ స్కీమ్స్ లోనే చేసుకోవడం మంచిది. ఈ స్కీమ్స్ కంటే తక్కువ రిస్క్ తో మీరు పెట్టుబడి చేయడానికి వేరే మార్గాలు లేవు). ఎంత డబ్బును పెట్టుబడి చేస్తాం, ఎంత కాలం చేయబోతున్నాం అనేదానిపై రిటర్న్ ఆధారపడి ఉంటుంది.  ఫిక్సిడ్ ఇన్కం స్కీమ్స్:

 1. బ్యాంకులలో ఫిక్సిడ్ డిపాజిట్లు
 2. భారత ప్రభుత్వం ఇచ్చే బండ్లు
 3. హడ్కో, నేషనల్ హైవేస్ అథారిటీ అఫ్ ఇండియా లాంటి ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చే బండ్లు
 4. కార్పొరేట్లు ఇచ్చే బాండ్లు

అక్టోబర్ 2017 నాటికి ఫిక్సిడ్ ఇన్కం డిపాజిట్ రేట్లు 6% నుండి 10% మధ్యలో ఉన్నాయి.

2. ఈక్విటీ:

ఈక్విటీలలో పెట్టుబడి చేయడం అంటే పబ్లిక్ గా లిస్టు చేయబడిన కంపెనీలలో షేర్లు కొనడం.  ఈ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) లలో ట్రేడ్ అవుతూంటాయి.

ఈక్విటీలలో పెట్టుబడి చేస్తే, ఇన్కం ఫిక్సిడ్ గా ఉండదు.  కానీ, రిటర్న్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.  చాలా భారత ఈక్విటీలు గత పదిహేను సంవత్సరాలుగా సంవత్సరానికి 14% – 15% CAGR (కాంపౌండ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ – దీని గురించి తరువాత తెలుసుకుందాం) రిటర్న్స్ ఇస్తున్నాయి.

మంచి కంపెనీలను ఎంచుకోవడం ద్వారా 20% CAGR రిటర్న్స్ లాంగ్ టర్మ్ లో వచ్చే అవకాశాలున్నాయి.  అలాంటి కంపెనీలను వెతకడానికి కాస్త ఓపికతో కష్టపడాలి.  వాటికి సంబంధించిన స్కిల్ అంటా తదుపరి చాప్టర్లలో తెలుసుకోవచ్చు.

3. రియల్ ఎస్టేట్:

రియల్ ఎస్టేట్లో వాణిజ్య – వాణిజ్యేతర భూమిని కొనడం, అమ్మడం జరుగుతుంది. అంటే కమర్షియల్ సైట్లు, అపార్ట్మెంట్లు, బిల్డింగులను కొనడం, అమ్మడం, అద్దెకు ఇవ్వడం లాంటి. రియల్ ఎస్టేట్లో ఇన్కం రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి రెంటల్ ఇన్కం (అద్దె ద్వారా వచ్చే ఆదాయం) కాగా మరొకటి కాపిటల్ అప్ప్రీసియేషన్ (సింపుల్గా కొన్న ప్రాపర్టీ ధర పెరగడం).

రియల్ ఎస్టేట్లో కొనడం, అమ్మడం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది.  డాక్యుమెంట్స్ లీగల్ వెరిఫికేషన్ చేయాలి.  పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.  ఇంత రిస్క్ తీస్కున్నా, వచ్చే రిటర్న్ ను అంచనా వేయలేం.  కాబట్టి దీనిలో పెట్టుబడి మీఇష్టం.

4. కమోడిటీ (సరుకు):

బంగారం, వెండిలో పెట్టుబడి గురించి అందరికీ తెలిసిందే. ‘సాంప్రదాయ పధ్ధతి’గా చెప్పుకోవచ్చు. బంగారం, వెండిపై చాలా కాలంగా పెట్టుబడి పెట్టినవారికి మంచి ఆదాయమే వచ్చింది.  ఈ సరుకులలో (Commodities) 8% నుండి 20% రిటర్న్స్ ఆశించవచ్చు.  బంగారం, వెండిలో పెట్టుబడి చేయాలనుకుంటే నగలు కొనడం లేదా  ఎక్స్చేంజ్ ద్వారా కొనుగోలు చేయడం [Exchange Traded Funds (ETF)] ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. Commodity (సరుకు) అంటే బంగారం, వెండే కాక క్రూడ్ ఆయిల్, నాచురల్ గాస్ వంటివి చాలా ఉంటాయి.

ఇప్పుడు మొదట చెప్పుకున్న వ్యక్తీ ఉదాహరణనే తీసుకుని అతని నెలవారీ 20 వెలను ఈ నాలుగు స్కీములలో ఎందులో పెట్టుబడి చేస్తే 20 సంవత్సరాల్లో ఎంత మొత్తం మిగులుతుందో చూద్దాం.

 1. ఫిక్సిడ్ ఇన్కంలో 9% వడ్డీ చొప్పున 3.3 కోట్లు.
 2. ఈక్విటీలలో 15% వచ్చింది అనుకుంటే – 5.4 కోట్లు.
 3. రియల్ ఎస్టేట్లో 8% అనుకుంటే – 3.09 కోట్లు.

క్లియర్ గా, అధిక కాలంలో ఈక్విటీలలో పెట్టుబడులే ఎక్కువ రాబడిని ఇస్తాయని గమనించవచ్చు.

గమనిక:

పెట్టుబడి ఒకే మార్గంలో చేయడం మంచిది కాదు.  పెట్టుబడిని అన్ని మార్గాలలో చేయడమే మంచిది.  ఏ మార్గంలో ఎంత పెట్టుబడి చేయాలి అనేదాన్ని వయస్సు ని బట్టి, ఎంత రిస్క్ చేయగలం అనేదానిని బట్టి నిర్ణయించుకోవాలి.

ఉదాహరణకు, ఒక యువకుడు పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోవడానికి అవకాశం ఉంది, అతనికి సంపాదించడానికి ఇంకా చాలా కాలం ఉంటుంది కాబట్టి. ఇలాంటి వారు 70% మొత్తాన్ని ఈక్విటీలలో, 20% మొత్తాన్ని సరుకులో మిగతా మొత్తాన్ని ఫిక్సిడ్ ఇన్కం స్కీమ్స్ లో పెట్టుబడి చేసుకోవడం మంచిది.

అలాగే, ఒక రిటైర్ అయిన నడివయస్కుడు 80% మొత్తాన్ని ఫిక్సిడ్ ఇన్కం స్కీముల్లో, 10% ఈక్విటీలలో, మరొక 10% మొత్తాన్ని సరుకులో పెట్టుబడి చేయడం మంచిది.  ఇది పెట్టుబడి చేసే వ్యక్తి ఇష్టం.

పెట్టుబడి చేసేముందు గుర్తుంచోకోవలసిన అంశాలు:

(ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో దోచుకోని/దోచుకోలేని ప్రతివాడు దోచుకోబడతాడు కాబట్టి పెట్టుబడి, దోపిడీ ‘అనివార్యం’! ‘డబ్బు’ ఉన్నంతకాలం ‘పెట్టుబడి’ ఉంటుంది. ‘పెట్టుబడి’ ఉన్నంత కాలం ‘దోపిడీ’ జరుగుతుంది. దోచుకోలేనంతకాలం ‘దోచుకోబడతారు’. ఇటువంటి వాక్యాలు ‘స్టాక్ మార్కెట్’ గురించి చెపుతూ రాయడంలో అర్ధం లేదు కాబట్టి ‘పెట్టుబడి’ టాపిక్ కు వస్తున్నాను.)

ప్రస్తుత వ్యవస్థలో భవిష్యత్తు కోసం పెట్టుబడి తప్పదు. పెట్టుబడి ద్వారా మంచి ‘రాబడి’ వస్తుంది. కానీ, పెట్టుబడి చేసేముందు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి:

 1. రిస్క్ మీదనే రాబడి ఆధారపడి ఉంటుంది.  ఎంత ఎక్కువ మొత్తం రిస్క్ చేస్తే అంత మొత్తంలోనే రిటర్న్ ఆధారపడి ఉంటుంది.  ఎంత తక్కువ రిస్క్ చేస్తే అంత తక్కువ రిటర్న్ ఉంటుంది.
 2. అసలు పెట్టుబడిని రిస్క్ చేయడం సాధ్యంకానివారు ఫిక్సిడ్ ఇన్కమ్ స్కీమ్స్ లో పెట్టుబడి చేయడం మంచిది. ఈ స్కీములు చాలా తక్కువ రిస్క్ తో కూడుకున్నటువంటివి.  కానీ, వడ్డీ రేటు కన్నా, ద్రవ్యోల్భణం (ధరల పెరుగుదల రేటు) ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడి నష్టంలో ఉంటుంది! – ఉదాహరణకు ఒక ఫిక్సిడ్ డిపాజిట్ 9% వడ్డీ ఇస్తుంది అనుకుందాం. కానీ ద్రవ్యోల్భణం 10% పెరుగుతూ పొతే, ప్రతీ ఏడాది లాభం సంగతి పక్కన పెడితే 1% నష్టపోతాం అని గుర్తుపెట్టుకోవాలి.  అసలు మొత్తం ఎటూ పోదు కానీ పది సంవత్సరాల క్రితం పది వేలు, ఇప్పటి పది వేలు ఒకటే కాదని గుర్తుంచుకోవాలి.
 3. ఈక్విటీలలో పెట్టుబడి మంచి అవకాశం.  లాంగ్ టర్మ్ లో ద్రవ్యోల్భణం కన్నా ఎక్కువ రాబడే ఇస్తాయి. గతాన్ని పరిశీలిస్తే, ఈక్విటీలలో పెట్టుబడులు 14-15% రాబడినిచ్చాయి.  కానీ ఇవి రిస్క్ తో కూడుకున్నటువంటివి.
 4. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి అధిక మొత్తంలో డబ్బు అవసరం.  తక్కువ డబ్బుతో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి కుదరదు.  అదీకాక, నచ్చినప్పుడు అమ్మడం, కొనడం సాధ్యపడదు.  ఎప్పుడూ సరైనా ధర కోసం ఎదురు చూడాలి, అప్పుడు కొనేవారు దొరకాలి.
 5. బంగారం, వెండి వంటివి చాలావరకు సేఫ్.  కానీ లాంగ్ టర్మ్ లో రాబడి అంత ఆశాజనకంగా ఉండదు.

“ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెట్టాలి” – ఈ చాప్టర్ క్లుప్తంగా:

 • భవిష్యత్తు కోసమే ‘పెట్టుబడి’.
 • ఆశిస్తున్న రాబడి చాలా అంశాలపై ముడిపడి ఉంటుంది.  ఒక చిన్న అంశం మన ‘రాబడి’ పై చాలా ప్రభావం చూపిస్తుంది.
 • ఎంత మొత్తాన్ని రిస్క్ చేస్తే ఫర్వాలేదనుకుంటారో, ఎంత రాబడి ఆశిస్తున్నారో, వయసును బట్టి ఎక్కడెక్కడ పెట్టుబడి చేయాలనేది నిర్ణయించుకోవాలి.
 • ద్రవ్యోల్భణం కన్నా రాబడి ఎక్కువ ఉండాలంటే, లాంగ్ టర్మ్ లో ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడం మంచి అవకాశం (మీ రిస్క్ మానేజ్మెంట్ ను బట్టి).

రేపటి చాప్టర్లో ‘మార్కెట్ ఎవరి ఆధీనంలో ఉంటుంది?‘ గురించి తెలుసుకుందాం.

ఫేస్బుక్ ద్వారా ‘స్టాక్ మార్కెట్’ సిరీస్ అప్డేట్స్ పొందటం కోసం లైక్ చేయండి:

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment