తెలుగు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశం

స్టాక్ మార్కెట్ సిరీస్: 5. IPO – రెండవ భాగం

గమనిక: ఈ చాప్టర్ ‘స్టాక్ మార్కెట్ సిరీస్’ లో భాగంగా రాయబడింది.  కొత్తగా చదువుతున్నవారు ఈ లింక్ లోకి వెళ్లి మొదటి చాప్టర్ నుండి చదవవచ్చు.

గత చాప్టరులో ఒక కంపెనీ మొదలు నుండి అది IPO స్టేజ్ వరకూ ఎలా వస్తుందో తెలుసుకున్నాం.  నిన్న చెప్పుకున్న ‘కథ’ అంతా కూడా IPO గురించి అర్థం కావడానికి చెప్పుకున్నదే.  కొన్ని కంపెనీలు నిన్న చెప్పుకున్న కథలో లాగా సిరీస్ ఫండ్, ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లు దాకా వెళ్ళకుండానే, మంచి పరిస్థితుల్లో లేకపోయినా IPO ను ఫైల్ చేస్తుంటాయి.  కాబట్టి, IPO మార్కెట్ గురించి తెలుసుకోవడం అవసరం.  IPO మార్కెట్ నే ‘ప్రైమరీ మార్కెట్’ అని కూడా అంటారు.

కంపెనీలు పబ్లిక్ గా షేర్లను ఎందుకు లిస్టు చేస్తాయి?

నిన్నటి చాప్టరు ను కొన్ని ప్రశ్నలతో ముగించాం.  అందులో ఒకటి ‘కంపెనీలు IPO ఎందుకు ఫైల్ చేయాలనుకుంటాయి?, అసలు కంపెనీలు ఎందుకు పబ్లిక్ గా లిస్టు అవుతాయి?’ ఒకటి.

ఏ కంపెనీ అయినా పబ్లిక్ గా లిస్టు చేయాలనుకోవడానికి ప్రధాన కారణం CAPEX (కంపెనీ విస్తరణకు అవసరమయ్యే డబ్బు) అవసరాలే.  కంపెనీని పబ్లిక్ గా లిస్టు చేయడం వల్ల ప్రమోటర్ కు మూడు లాభాలుంటాయి.

 1. CAPEX కు అవసరమైన డబ్బును రాబట్టడం.
 2. ‘అప్పు’, ‘వడ్డీ’ బాధలు ఉండవు.  బ్యాంకు ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో ‘అప్పు’ తీసుకుంటే వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంటుంది.  ఇప్పుడా అవసరం ఉండదు.
 3. మనం ఎప్పుడైనా షేర్లను కొంటే, ఆ కంపెనీ ప్రమోటర్ తీసుకున్నంత రిస్కు మీ మీద కూడా ఉంటుంది.  ఎన్ని షేర్లను కొంటే అంత రిస్కు.  మనకు నచ్చినా, నచ్చకపోయినా మనం ఏ కంపెనీ షేర్లను కొన్నా ‘రిస్కు’ ను కూడా కొన్నట్లే అని గుర్తుంచుకోవాలి.  సో, ఒక కంపెనీ పబ్లిక్ గా లిస్టు అయినప్పుడు, ఆ కంపెనీ ప్రమోటర్ తన రిస్కును ఇంకొంతమందికి పంచుతున్నట్లు లెక్క.

IPO ఫైల్ చేయడం వల్ల ఇంకొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి:

 1. కంపెనీ షేర్ హోల్డర్లు తమ షేర్లను అమ్ముకోవచ్చు: ఒకసారి కంపెనీ పబ్లిక్ గా లిస్టు అయితే, ఆ కంపెనీ షేర్లు పబ్లిక్ గా ట్రేడ్ అవ్వడం మొదలవుతుంది.  అంటే పబ్లిక్ గా ఎవరైనా ఆ కంపెనీ షేర్లను కొనడం / అమ్మడం చేయవచ్చు.  అప్పటిదాకా కంపెనీలో పెట్టుబడి పెట్టిన ప్రమోటర్, ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ కాపిటలిస్ట్లు, ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లు; ఎవరైనా వారి షేర్లను అమ్ముకుని ఆ కంపెనీ నుండి బయటకు వెళ్లిపోవచ్చు.
 2. కంపెనీ ఉద్యోగులకు బహుమతులు:  కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు షేర్ల రూపంలో ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.  ఈ మార్గాన్నే ‘ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్’ అంటారు.  ఈ షేర్లను డిస్కౌంట్ కే ఉద్యోగులకు అందిస్తుంది.  గూగుల్, ఇన్ఫోసిస్, ట్విట్టర్ లాంటి కంపెనీలు ఇలానే ఉద్యోగులకు ప్రోత్సాహకాలుగా షేర్లను అందిస్తారు.
 3. కంపెనీ బ్రాండ్:  పబ్లిక్ గా లిస్టు అయిన కంపెనీ గురించి చాలా మందికి తెలుస్తుంది, ట్రేడింగ్ కూడా పబ్లిక్ గా జరుగుతుంది కాబట్టి, కంపెనీ బ్రాండ్ మరింత పెరుగుతుంది.

నిన్నటి చాప్టరులో చెప్పుకున్న ‘కథ’ ను గుర్తుచేసుకుంటే, కంపెనీకు 200 కోట్ల CAPEX అవసరమయ్యి  కొంత మొత్తాన్ని ఇంటర్నల్ అక్రువల్స్ ద్వారా తెచ్చుకోగా, మిగతా మొత్తాన్ని IPO ద్వారా తెచ్చుకుందామని నిర్ణయించుకుంది.

కంపెనీ పేరిట 16% షేర్లు (అంటే 8 లక్షల షేర్లు) ఉన్నాయి.  చివరిగా ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్ పెట్టుబడి చేసినప్పుడు ఆ షేర్లు 64 కోట్ల విలువగలవి.  ఇప్పుడు కంపెనీ అవే షేర్లను 125 నుండి 150 కోట్లకు విలువ కడుతుంది.  అంటే ఒక్కొక్క షేర్ విలువ రూ.1562 నుండి రూ.1875 మధ్యలో ఉంటుంది.  సో, కంపెనీ పేరిట ఉన్న ఈ 16% షేర్లను పబ్లిక్ గా పెడితే,  కంపెనీకు 125 నుండి 150 కోట్లు ఆదాయం వస్తుంది.  మిగతా మొత్తాన్ని ఇంటర్నల్ అక్రువల్స్ ద్వారా తెచ్చుకుంటుంది.  కంపెనీ షేర్ విలువను ఎంత ఎక్కువగా విలువకడితే, కంపెనీకు అంత ఎక్కువ డబ్బు వస్తుంది.

మర్చెంట్ బ్యాంకర్లు:

పబ్లిక్ గా లిస్టు అవ్వాలని నిర్ణయించింది కనుక ఇప్పుడు ఆ కంపెనీ కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.  మొట్టమొదటిగా ఒక ‘మర్చెంట్ బ్యాంకర్’ ను నియమించాలి.  వీరినే ‘బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ / లీడ్ మేనేజర్’ అని కూడా పిలుస్తారు.  వీరు ఈ క్రింది పనులు చేయడానికి కంపెనీకు సహాయపడతారు:

 • కంపెనీ IPO ఫైల్ చేయడానికి అవసరమైన లీగల్ వర్క్ కు సహాయపడతారు.
 • కంపెనీతో ఆక్టివ్ గా సంప్రదింపులు చేస్తూ, ‘డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్’ (DRHP) లాంటి పత్రాలను ప్రిపేర్ చేస్తారు. – దీనిగురించి క్రింద వివరించాను.
 • Underwrite షేర్లు – దీని ద్వారా మర్చెంట్ బ్యాంకర్లు ముందుగా పబ్లిక్ లిస్టింగ్ కు పెట్టిన అన్నీ / కొన్ని షేర్లను కొని వాటినే పబ్లిక్ కు తిరిగి అమ్ముతారు.
 • షేర్ల విలువను నిర్ణయించడానికి సహాయపడుతుంది.  మనం చెప్పుకున్న ఉదాహరణలో షేర్ విలువ 1562-1875 గా ఉంది.
 • కంపెనీ రోడ్ షో చేయడానికి సహకరిస్తుంది.  IPO ఫైల్ చేస్తున్నట్లు ప్రమోషన్ చేసేందుకు సహకరిస్తుంది.
 • ఇతర మధ్యవర్తులను నియమిస్తుంది – ఉదాహరణకు రిజిస్ట్రార్లు, బ్యాంకర్లు, ప్రకటన ఏజెన్సీలు లాంటివి.  వీరందరూ కూడా కంపెనీ IPO కు ప్రమోషన్ చేపడతారు.

సింపుల్గా – ఒక్కసారి కంపెనీ మర్చెంట్ బ్యాంకర్ ను నియమించిన తరువాత, ఆ బ్యాంకరు పని కంపెనీ ని పబ్లిక్ గా తీసుకువెళ్లేందుకు సహకరించడమే.  పైన చెప్పిన పాయింట్లన్నీ తెలుసుకోవలసిన పని లేదు.  మొత్తంగా అర్థం చేసుకుంటే చాలు.

IPO ప్రక్రియ:

ఈ IPO ప్రక్రియ కూడా ‘సెబి’ మార్గాల ప్రకారమే నడుచుకుంటుందని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.  సాధారణంగా ఈ క్రింది క్రమంలో IPO ప్రక్రియ జరుగుతుంది.

 • మర్చెంట్ బ్యాంకర్ను నియమించడం – ఒకవేళ IPO పెద్దదైతే 1 కన్నా ఎక్కువ బ్యాంకర్లను కూడా నియమించవచ్చు.
 • ‘సెబి’ కు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన స్టేట్మెంట్ ను పంపించాలి.  ఈ స్టేట్మెంట్ లో కంపెనీ గురించిన పూర్తి వివరాలు, కంపెనీ ఎందుకు పబ్లిక్ గా లిస్టు అవుదామనుకుంటుంది లాంటి వివరాలుంటాయి.
 • ‘సెబి’ నుండి అంగీకారం పొందడం – రిజిస్ట్రేషన్ స్టేట్మెంట్ పొందిన తరువాత ఆ కంపెనీ IPO కు అంగీకారం ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించి చెబుతుంది.
 • DRHP – ‘సెబి’ అంగీకారం ఇస్తే, కంపెనీ DRHP ని తయారుచేయాలి. ఈ DRHP లో ఈ క్రింది వివరాలుంటాయి:
 1. IPO పరిమాణం
 2. ఎన్ని షేర్లను పబ్లిక్ గా లిస్టు చేయదలచుకున్నారు
 3. కంపెనీ ఎందుకు పబ్లిక్ గా లిస్టు అవ్వాలనుకుంటుంది?
 4. ఆదాయం, ఖర్చుల వివరాలు, కంపెనీ వ్యాపారం గురించి.
 5. పూర్తి ఆర్ధిక ప్రకటనల వివరాలు
 6. కంపెనీ మానేజ్మెంట్ చేసిన, చేయబోతున్న చర్చలు, విశ్లేషణ
 7. కంపెనీలో ఉన్న రిస్కులు
 8. కంపెనీ మానేజ్మెంట్ వివరాలు
 • IPO కు సంబంధించిన వివరాలను TV లలో, పేపర్లలో ప్రకటనలు ఇచ్చి, జనానికి ఈ కంపెనీ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది.
 • షేర్ రేటును నిర్ణయించడం. మరీ ఎక్కువ ధరకు షేర్ విలువను లెక్క కట్టలేరు.  అలా లెక్కకడితే, పబ్లిక్ IPO ను సబ్స్క్రైబ్ చేసుకోరు కదా!
 • బుక్ బిల్డింగ్: కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ను 100-120 గా నిర్ణయిస్తే, పబ్లిక్ ఆ షేరుకు ఎంత ధర పెట్టొచ్చో నిర్ణయిస్తారు.  ఈ ప్రాసెస్ నే ‘బుక్ బిల్డింగ్’ అని అంటారు.
 • బుక్ బిల్డింగ్ పూర్తైన తరువాత (బుక్ బిల్డింగ్ కొన్ని రోజులు ఉంటుంది.  ఆ సమయంలోనే పబ్లిక్ షేర్ ధరను నిర్ణయించే అవకాశం ఉంటుంది) షేర్ ఫైనల్ ధర తెలుస్తుంది.  బుక్ బిల్డింగ్ ప్రక్రియలో ఎక్కువమంది ఏ ధర అయితే అనుకుంటారో, అదే ధర ఫైనల్ చేయబడుతుంది.
 • ఇదంతా జరిగిన తరువాత కంపెనీ స్టాక్ ఎక్స్చేంజి లో పబ్లిక్ గా అందుబాటులోకి వస్తుంది.

IPO పూర్తైన తరువాత ఏం జరుగుతుంది?

IPO ప్రక్రియలో జరిగేదంతా ‘ప్రైమరీ మార్కెట్’ అనీ, స్టాక్ ఎక్స్చేంజి లో లిస్టు అయిన తరువాత జరిగే మార్కెట్ ను ‘సెకండరీ మార్కెట్’ అనీ పిలుస్తారు.

ప్రైమరీ మార్కెట్ పూర్తయి సెకండరీ మార్కెట్ కు వచ్చిన నాటి నుండి కంపెనీ ప్రతీ రోజూ ట్రేడ్ చేయబడుతుంది.

జనం ఎందుకు ట్రేడ్ చేస్తారు?  షేర్ విలువ ఎందుకు తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది?  ఇవన్నీ వచ్చే చాప్టర్లలో తెలుసుకుంటాం.

IPO లో కొన్ని అర్థం కాని పదాలు:

 • Under Subscription అంటే:  ఒక కంపెనీ 1,00,000 (లక్ష) షేర్లను పబ్లిక్ గా లిస్టు చేద్దాం అనుకుంటోంది.  బుక్ బిల్డింగ్ ప్రక్రియలో 90 వేల షేర్లు మాత్రమే కొనేందుకు బిడ్డింగ్ జరిగితే అప్పుడు ఆ IPO అండర్ సబ్స్క్రైబ్ చేయబడింది అంటారు.  అంటే, పబ్లిక్ గా లిస్టు చేయబడిన షేర్లకంటే తక్కువ షేర్లను కొనే పరిస్థితి ఉన్నట్లు లెక్క.
 • Over Subscription అంటే:  లక్ష షేర్లకు 2 లక్ష బిడ్లు వస్తే అప్పుడు ఆ IPO Over Subscribe చేయబడింది అంటారు.  లిస్టు చేయబడిన షేర్ల కంటే ఎక్కువ షేర్లను కొనే పరిస్థితి.
 • గ్రీన్ షూ:  ఒక వేల Over Subscription జరిగితే, అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం, 15% ఎక్కువ షేర్లను లిస్టు చేసే అవకాశం కంపెనీకు ఉంటుంది.  దీనినే ఓవర్ అలాట్మెంట్ అని కూడా అంటారు.
 • ఫిక్సిడ్ ప్రైస్ IPO:  కొన్ని కంపెనీలు ప్రైస్ బ్యాండ్ (100 – 120) లా కాకుండా, ఒక ఫిక్సిడ్ ప్రైస్ పెడుతుంది.  ఆ ధరకే పబ్లిక్ సబ్స్క్రయిబ్ చేసుకోవాలి.  ఇలాంటి IPOను ఫిక్సిడ్ ప్రైస్ IPO అని పిలుస్తారు.
 • ప్రైస్ బ్యాండ్ & కటాఫ్ ప్రైస్:  ఒక ప్రైస్ బాండ్ 100-130 అయితే, ఈ రేంజ్ లోనే లిస్టు చేసుకోవచ్చు.  ఉదాహరణకు ఆ షేర్ కు అత్యధిక బిడ్లు 125 రూపాయలకు వస్తే, 125ను కటాఫ్ ప్రైస్ అంటారు.

ఇంతటితో స్టాక్ మార్కెట్ కంటే ముందే తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకున్నాం.  రేపటి చాప్టరు తో ‘స్టాక్ మార్కెట్’ మొదలవుతుంది.  ఇప్పటిదాకా తెలుసుకున్నవి కనీస వివరాలే.  రేపటి చాప్టరులో ‘స్టాక్ మార్కెట్’ అంటే ఏమిటి, షేర్ విలువ ఎందుకు తగ్గుతూ పెరుగుతూంటుంది, అసలు షేర్ ఎలా ట్రేడ్ అవుతుంది లాంటివి తెలుసుకుందాం.

(గమనిక:  ‘స్టాక్ మార్కెట్ సిరీస్’ ను సాధ్యమైనంత వివరంగానే రాయడానికి ప్రయత్నిస్తున్నాను.  ఇది ఇంకా ప్రారంభదశలోనే ఉంది కాబట్టి, ఇప్పటివరకు వచ్చిన సందేహాలు, అర్థంకానివి, ఇంకా మెరుగ్గా రాయడానికి అవకాశాలేమైనా తోచితే, కామెంట్స్ లో తెలుపండి.)

ఫేస్బుక్ ద్వారా ‘స్టాక్ మార్కెట్’ సిరీస్ అప్డేట్స్ పొందటం కోసం లైక్ చేయండి:

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment