తెలుగు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశం

స్టాక్ మార్కెట్ సిరీస్: 4. కంపెనీలు షేర్లను ఎందుకు అమ్ముతాయి (IPO) – మొదటి భాగం

గమనిక: ఈ చాప్టర్ ‘స్టాక్ మార్కెట్ సిరీస్’ లో భాగంగా రాయబడింది.  కొత్తగా చదువుతున్నవారు ఈ లింక్ లోకి వెళ్లి మొదటి చాప్టర్ నుండి చదవవచ్చు.

ఇప్పటివరకు చదివిన మూడు చాప్టర్లలో స్టాక్ మార్కెట్ బాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాం.  ఇప్పటికే అసలు కంపెనీలు షేర్లను ఎందుకు అమ్ముతాయి?  స్టాక్ ఎక్స్చేంజి లో ఎందుకు లిస్ట్ అవుతాయి అనే సందేహం వచ్చి ఉంటుంది.  దాని గురించే ఈ చాప్టరు.  ఈ చాప్టర్లు అన్నీ అంత అవసరమా? అని కూడా అనిపించవచ్చు కానీ వీటి గురించి తెలుసుకుంటేనే భవిష్యత్తులో తెలుసుకునే అంశాలు అర్థమవుతాయి.  ఈ చాప్టర్లు వదిలేసి టెక్నికల్ అనాలసిస్కో, ట్రేడింగ్ ప్లాట్ఫారంకో డైరెక్ట్ గా వెళితే సగం – సగం అర్థమవుతుంది కాబట్టి ‘పూర్తిగా’ స్టాక్ మార్కెట్ గురించి అర్థం చేసుకోవాలంటే, ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందే.

వ్యాపారానికి మూలమేమిటి?

కంపెనీలు పబ్లిక్ గా ఎందుకు లిస్టు అవుతాయో తెలుసుకునేముందు అసలు వ్యాపార విధానాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.  సింపుల్గా అర్థం చేసుకునేందుకు ఒక కథలా చెప్పుకుందాం.

సీన్ 1 – ది ఏంజెల్స్:

ఒక యువకుడు ఒక మంచి ఐడియా తో వ్యాపారం మొదలుపెడతాం అనుకుంటున్నాడు.  అతని వ్యాపారం బాగా ఫాషనబుల్ T-షర్ట్లు తయారు చేసేది.  ఆ షర్ట్ల డిజైన్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.  ఈ వ్యాపారం ఖచ్చితంగా విజయవంతమవుతుంది అని అతనికి బాగా నమ్మకముంది.  అతను తన ఈ ఐడియాతో వ్యాపారాన్ని వెంటనే మొదలుపెడదాం అని నిర్ణయించుకున్నాడు.

అంతా బాగానే ఉంది.  అతని వ్యాపారానికి డబ్బెవరిస్తారు?  ఎటువంటి బాక్గ్రౌండ్ లేదు.  కేవలం ఐడియానే ఉంది.  ఏం చేయగలడు?  అతని కుటుంబంలో ఎవర్నైనా అడిగి కొంత డబ్బు తీస్కోగలడు.  స్నేహితులదగ్గర కొంత తీసుకోగలడు.  బ్యాంక్ లో లోన్ తీసుకోగలడు కానీ అది అంత మంచి ఆలోచన కాదు.

ఇప్పుడతను అతని దగ్గర ఉన్న డబ్బుతో పాటు, మరో ఇద్దరు స్నేహితులకు తన ఐడియా చెప్పి, తన వ్యాపారంలో ‘పెట్టుబడి’ పెట్టడానికి ఒప్పించాడు.  ఈ ఇద్దరు స్నేహితులూ అతని ‘ఐడియా’ ను నమ్మి, ఏ విజయాన్నీ చూడకుండానే, మొదట్లోనే ‘పెట్టుబడి’ పెట్టారు కాబట్టి వీరిని ‘ఏంజెల్ ఇన్వెస్టర్స్’ అంటారు.  ఇక్కడ మనమొక విషయాన్ని గుర్తుంచుకోవాలి.  ఈ ఇద్దరు స్నేహితులూ అతని వ్యాపారంలో ‘పెట్టుబడి’ పెట్టారు.  ‘అప్పు’ కాదు.  అంటే లాభం వచ్చినా, నష్టం వచ్చినా భరించాలి.

ఈ వ్యాపారం పెడదాం అనుకున్న వ్యక్తిని ‘ప్రమోటర్’ అంటాం.  ప్రమోటర్ ఈ ‘ఏంజెల్ ఇన్వెస్టర్స్’ నుండి 5 కోట్లు పెట్టుబడిగా పొందాడు.  ఈ మొదట వచ్చిన పెట్టుబడిని ‘సీడ్ ఫండ్’ అని అంటాం.  సీడ్ ఫండ్ గా వచ్చిన డబ్బు ‘ప్రమోటర్’ పర్సనల్ ఖాతాలో ఉండదని మనం తెలుసుకోవాలి.  సీడ్ ఫండ్ డబ్బు వీరు మొదలుపెట్టిన కంపెనీ ఖాతాలోనే ఉంటుంది.  ఎప్పుడైతే ఈ సీడ్ ఫండ్ బ్యాంక్ ఖాతాలో పడుతుందో అప్పుడే దానిని ఆ డబ్బును కంపెనీ యొక్క ‘షేర్ కాపిటల్’ అని పిలుస్తాం.

ఈ మొదటి సీడ్ ఫండ్ వల్ల, వీరు ముగ్గురికీ (ప్రమోటర్ + ఏంజెల్స్) కు షేర్ సర్టిఫికెట్లు ‘కంపెనీ’ తరపున ఇవ్వబడతాయి.  ఈ షేర్ సర్టిఫికేట్లే వారికి కంపెనీలో ఓనర్షిప్ ఉన్నట్లు ఆధారం.

ఇప్పుడు కంపెనీ పేరు మీద ఉన్న ఒకే ఒక్క ఆస్తి డబ్బు రూపేణా ఉన్న ‘5 కోట్లు’ మాత్రమే.  కాబట్టి, ఆ కంపెనీ విలువ కూడా 5 కోట్లే.

షేర్లను ఇవ్వడం చాలా ఈజీ.  ఉదాహరణకు కంపెనీ ఒక్కొక్క షేర్ విలువను రూ.10 గా లెక్కకడితే, 5 కోట్ల విలువైన ఈ కంపెనీకు 50 లక్షల షేర్లు ఉంటాయి.  ప్రతీ షేర్ విలువ రూ.10.  ఈ రూ.10 నే షేర్ యొక్క ‘ఫేస్ వాల్యూ’ అని అంటారు.  ఫేస్ వాల్యూ ఎంతైనా ఉండవచ్చు.  ఒకవేళ ఫేస్ వాల్యూ రూ.5 అయితే, కంపెనీలో 1 కోటి షేర్లు ఉంటాయి.  ఫేస్ వాల్యూని బట్టి, కంపెనీ వాల్యూని బట్టి షేర్ల ‘సంఖ్య’ ఉంటుంది.

ఇప్పుడు ఈ కంపెనీకు 50 లక్షల షేర్లు ఉన్నాయి.  వీటిని ఆ కంపెనీ యొక్క ‘ఆతరైస్ద్ షేర్స్’ (Authorized Shares) గా పిలుస్తాం.  ఈ షేర్లను ప్రమోటర్ కు, ఏంజెల్స్ కు + భవిష్యత్తులో ఎవరికైనా ఇచ్చేందుకు ‘కంపెనీ’ కు పంచుతారు.

ఇప్పుడు ప్రమోటర్ కు 40% షేర్లు, ఏంజెల్స్ కు చెరొక 5% షేర్లు, కంపెనీ పేరిట 50% షేర్లు ఉన్నాయనుకుందాం.  కంపెనీ పేరిట కాకుండా ప్రమోటర్ పేరు మీద, ఏంజెల్స్ పేరు మీద ఉన్న 50% షేర్లను ‘ఇష్ష్యూ చేసిన షేర్లు’ (Issued Shares) గా పిలుస్తారు.

ఇప్పుడు ఆ కంపెనీ షేర్ హోల్డింగ్ ఈ విధంగా ఉంటుంది:

ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి.  ప్రమోటర్, ఏంజెల్స్ పేరు మీద కాకుండా, కంపెనీ పేరు మీద ఇంకా 50% షేర్లు, అంటే 25,00,000 షేర్లు ఎవరికీ ఇవ్వకుండానే ఉన్నాయి.

ఇప్పుడు ఈ కంపెనీ ఒక రూపానికి వచ్చింది.  ప్రమోటరు వ్యాపారాన్ని ప్రారంభించడం మొదలుపెట్టాడు.  జాగ్రత్తగా వ్యాపారం చేస్తూ ఒక ‘తయారీ యూనిట్’ ను, ఒక ‘స్టోర్’ ను కూడా ప్రారంభించాడు.

సీన్ 2 – వెంచర్ కాపిటలిస్ట్ (Venture Capitalist):

అతని ప్రయత్నాలు ఫలించి, అతని వ్యాపారం మంచిగా సాగుతుంది.  మొదటి 2 సంవత్సరాలు సజావుగా సాగింది.  ఇప్పుడు ‘పెట్టుబడి’ చేసిన మొత్తం రికవర్ అయింది.  కంపెనీ ‘లాభాల్లోకి’ అడుగుపెట్టింది.  ఇప్పుడు ప్రమోటర్ కంపెనీ మొదలుపెట్టినప్పుడు ఉన్నట్లు లేడు.  ఈ 2 సంవత్సరాలలో చాలా విషయాలు నేర్చుకున్నాడు, ఇప్పుడు తన వ్యాపారంపై ఇంకా నమ్మకంతో ఉన్నాడు.

ఆ నమ్మకంతోనే తన వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నాడు.  కంపెనీ పేరిట మరొక తయారీ యూనిట్ ను, మరికొన్ని స్టోర్లను ప్రారంభించాలనుకున్నాడు.  దీనికి గాను 7 కోట్లు అవసరమవుతాయని అంచనా.

2 సంవత్సరాల క్రితం కన్నా అతను ఇప్పుడు మెరుగైన పరిస్థితులలో ఉన్నాడు.  అన్నిటికన్నా ముఖ్యంగా ‘కంపెనీ’ మంచి ఆధాయాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అతనికి ఈ 7 కోట్లు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు.  కాబట్టి, అతను ఒక మంచి ఇన్వెస్టర్ను కలిసి తన కంపెనీలో 7 కోట్లు పెట్టుబడి పెట్టమని అడిగాడు. దానికి గాను తన కంపెనీలో 14% షేర్లను ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ స్టేజిలో పెట్టుబడి చేసేవాళ్ళని ‘వెంచర్ కాపిటలిస్ట్’ (Venture Capitalist) గా పిలుస్తారు.  ఈ స్టేజిలో వచ్చే పెట్టుబడిని ‘సిరీస్ – A’ ఫండింగ్ గా పిలుస్తారు.

14% షేర్లు అమ్మడానికి నిరయించిన తరువాత కంపెనీ షేర్ హోల్డింగ్ ఇలా ఉంటుంది:

ఇంకా ‘కంపెనీ’ పేరిట 36% షేర్లు ఉన్నాయి.  64% షేర్లను ఇష్యూ చేసారు.

వెంచర్ కాపిటలిస్టును ‘వీసీ’ గా పిలుస్తారు.  ఈ ‘వీసీ’ పెట్టుబడి చేసిన తరువాత కంపెనీలో మంచి పురోగతి కనిపించింది.  ఈ వీసీ కి ఇచ్చిన 14% షేర్లతో కలిపి మొత్తం కంపెనీ ఇప్పుడు 50 కోట్ల విలువ చేస్తుంది.  మొదట్లో కంపెనీ 5 కోట్లతో ప్రారంభిస్తే, ఇప్పుడు 50 కోట్లు విలువ చేస్తుంది.  10 రెట్లు పెరిగింది.  ఒక మంచి ఆలోచన, సరైన పద్ధతిలో వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం ఇలాంటి లాభాలనే తెచ్చిపెడుతుంది!

ఇప్పుడు షేర్ హోల్డింగ్, వాటి విలువ, మొదటితో పోలిస్తే ఇప్పుడు ఎంత విలువ పెరిగిందో చూద్దాం:

ఇప్పుడు ప్రమోటర్ కు ఇంకా ‘పెట్టుబడి’ అవసరం పడుతుంది.  అనుకున్న ప్రకారమే కంపెనీకు కొత్త తయారీ యూనిట్లను, స్టోర్లను ఇప్పటికే తెరిచారు.  అంతా సజావుగా సాగుతుంది, కంపెనీ T-షర్ట్లకు మంచి పేరు వస్తుంది, మంచి లాభాలు వస్తున్నాయి, కంపెనీ మానేజ్మెంట్ కూడా విధులను సక్రమంగా నిర్వర్తిస్తూంది.

సీన్ 3 – బ్యాంకర్:

కంపెనీ మొదలుపెట్టి 3 సంవత్సరాలు దాటింది.  కంపెనీ విజయవంతంగానే కొనసాగుతుంది.  ఇప్పుడు ఇంకో 3 సిటీలలో వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించారు.  కంపనీ ఇప్పుడు తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలనుకుంటోంది.  ఎప్పుడైతే కంపెనీ మొత్తం వ్యాపారాభివృద్ధికి పెట్టుబడి అవసరమవుతుందో, ఆ పెట్టుబడిని ‘కాపిటల్ ఎక్స్పెండిచర్’ (Capital Expenditure or CAPEX) అని అంటారు.

ఈ CAPEXకుగానూ 40 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసారు.  కంపెనీ అంత డబ్బును ఎలా తెస్తుంది?

డబ్బును తెచ్చుకోవడానికి కంపెనీకు ఈ మార్గాలున్నాయి:

 1. గత మూడు సంవత్సరాలుగా కంపెనీ లాభాల్లో ఉంది.  కాబట్టి కొంత డబ్బును ఆ లాభాల్లో నుండి తీసుకోవచ్చు.  ఈ తరహా ఫండింగ్ ను ‘ఇంటర్నల్ అక్రువల్స్’ అని అంటారు.  అంటే కంపెనీ అంతర్గత నిధులనుండి తీసుకున్న పెట్టుబడి.
 2. కంపెనీ మరొక ‘వీసీ’ ని కలిసి మరోసారి షేర్లు అమ్మవచ్చు.  దీనిని – సిరీస్ B ఫండింగ్ అని అంటారు.
 3. కంపెనీ ఏదోక బ్యాంకులో లోన్ పొందవచ్చు.  ఈ కంపెనీ లాభాల్లో ఉంది కాబట్టి బ్యాంకు కూడా ‘సంతోషంగా’ ‘లోన్’ ఇస్తుంది.  ఈ లోన్ ను ‘అప్పు’ అని కూడా అనవచ్చు.

ఈ మూడు మార్గాలద్వారా కంపెనీ 40 కోట్లు పెట్టుబడి సంపాదించాలని నిర్ణయించింది.  15 కోట్లు ఇంటర్నల్ అక్రువల్స్ ద్వారా, సిరీస్ B ఫండింగ్ ద్వారా 5% షేర్లు అమ్మి 10 కోట్లు, మరొక 15 కోట్లు బ్యాంక్ నుండి అప్పుగా తీసుకుని CAPEX ఫండింగ్ పూర్తి చేసుకుంది.

గమనిక:  5% షేర్లు అమ్మి 10 కోట్లు తెచ్చుకుంది కాబట్టి, ఇప్పుడు కంపెనీ విలువ 200 కోట్లయ్యింది!  ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఈ ‘కథ’ సారాంశం అదే.  లోతుగా ఆలోచించండి, అర్థమవుతుంది. ఇప్పుడు కంపెనీ షేర్ హోల్డింగ్ ఈ విధంగా ఉంటుంది:

ఇప్పటికీ కంపెనీ పేరిట 31% షేర్లు ఎవరికీ ఇవ్వకుండా ఉన్నాయి.  ఈ 31% షేర్లు 62 కోట్ల విలువ చేస్తాయి!  ఒకసారి ఎంత ‘డబ్బు’ సృష్టించబడిందో ఆలోచించండి!  ఒక మంచి ఆలోచన విజయవంతమయితే ఫలితం ఇలానే ఉంటుంది!  ఇలాంటి కంపెనీలే ఇన్ఫోసిస్, పేజ్ ఇండస్ట్రీస్, ఐచార్ మోటార్స్, టైటాన్ ఇండస్ట్రీస్.  అంతర్జాతీయంగా చూస్తే గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ కూడా ఇలాంటి కంపెనీలే.

సీన్ 4 – ప్రైవేట్ ఈక్విటీ:

మరికొన్ని సంవత్సరాలు గడిచాయి.  కంపెనీ ఇంకా లాభాలు తెస్తూనే ఉంది.  పురోగతి సాధిస్తూనే ఉంది.  8 సంవత్సరాలుగా లాభాలు గడిస్తూ, 200 కోట్ల విలువ చేస్తున్న కంపెనీ, తమ లక్ష్యాలను కూడా పెంచుకుంటూంది.  కంపెనీ ఇప్పుడు తమ స్టోర్లను దేశ వ్యాప్తంగా విస్తరించాలనుకుంటుంది! అలానే కంపెనీలో T-షర్ట్లుతో పాటు ఇతర డిజైనర్ కాస్మోటిక్స్, ఫాషన్ ఉపకరణాలు, పర్ఫ్యూమ్లు లాంటివి కూడా తయారుచేసి అమ్మాలని నిర్ణయించుకుంది.

ఇప్పుడు Capex అవసరాలకు గానూ 60కోట్లు అవసరమవుతాయని అంచనా వేసారు.  ఈ డబ్బును ‘అప్పు’ల ద్వారా తెచ్చుకోవాలని కంపెనీ భావించడం లేదు.  ‘అప్పు’గా తెస్తే వడ్డీలను ‘లాభాల’ నుండి ఇవ్వల్సివస్తుంది కాబట్టి!

ఇప్పుడు సిరీస్ C ఫండింగ్ ద్వారా షేర్లను అమ్మాలని కంపెనీ నిర్ణయించింది.  ఈ సిరీస్ C ఫండింగ్ కు ఇదివరకటి సిరీస్ A, B ఫండింగ్ లలో లాగా మరొక ‘వీసీ’ ని తెచ్చుకోవడం కుదరదు.  వీసీ ఫండింగ్ అనేది చిన్న మొత్తం కోసం మాత్రమే.  ఇప్పుడు ‘ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్’ (PE) రంగంలోకి వస్తాడు.

ఈ PE ఇన్వెస్టర్లు అన్ని రంగాల్లో అనుభవం ఉన్నవారై ఉంటారు.  వీరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడతారు.  వీరు పెట్టుబడి పెట్టడం మాత్రమే కాకుండా ఆ పెట్టుబడి చేసిన కంపెనీలో వారికి చెందిన వ్యక్తుల్ని బోర్డు మెంబర్ గా ఉంచుతారు.  అంటే, కంపెనీ తీసుకునే నిర్ణయాల్ని సమర్థించే / వ్యతిరేఖించే హక్కు వీరికి ఉంటుంది.

ఇప్పుడు వీరు 15% షేర్లను 60 కోట్లకు విలువ కట్టి PE కు వాటా ఇచ్చారు అనుకుందాం.  దీనితో కంపెనీ విలువ 400 కోట్లకు చేరింది!  ఇప్పుడు కంపెనీ షేర్ హోల్డింగ్ ఇలా ఉంటుంది:

ఇంకా కంపెనీ పేరిట 16% షేర్లు ఎవరికీ ఇష్యూ చేయకుండా ఉన్నాయి.  ఈ 16% షేర్లు 64 కోట్ల విలువ చేస్తున్నాయిప్పుడు!

సాధారణంగా ఈ PE ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో CAPEX అవసరాలను తీరుస్తారు.  అంతేకాక, వీరు కంపెనీ మొదట్లో పెట్టుబడి పెట్టరు.  కంపెనీ చాలాకాలంగా మంచి లాభాల్లో ఉన్నప్పుడు, అదనంగా కంపెనీకు పెట్టుబడి అవసరమైనప్పుడు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు.  వీరు పెట్టిన పెట్టుబడి ‘లాభాలు’ గా మారడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది.

సీన్ 5 – IPO (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్):

PE ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 5 సంవత్సరాల తరువాత కంపెనీ మంచి లాభాల్లో ఉంది.  కంపెనీ వస్తువులకు మంచి గిరాకీ దేశ వ్యాప్తంగా ఏర్పడింది.  ఆదాయం బావుంది.  లాభాలు నిలకడగా ఉన్నాయి, పెట్టుబడిదారులు సంతోషంగా ఉన్నారు.  కానీ, ప్రమోటర్ ఇంతటితో సంతృప్తి చెందలేదు.

ప్రమోటర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన కంపెనీని విస్తరించాలని అనుకుంటున్నాడు!  తన కంపెనీ వస్తువులు అంతర్జాతీయంగా అందుబాటులో ఉండాలని అనుకుంటున్నాడు.  కనీసం 2 వేర్వేరు దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు ఉండాలని నిర్ణయించాడు.

అంటే ఇప్పుడు కంపెనీ వేరే దేశాల్లో మార్కెట్ గురించి పరిశోధన చేయాలి.  ఏ దేశాల్లో జనం ఎలా ఉంటారు, ఆ జనానికి ఏమేం అవసరమవుతున్నాయి, అక్కడ కంపెనీని విస్తరిస్తే తయారీ సామర్థ్యాన్ని ఎంత పెంచాలి లాంటివన్నీ స్టడీ చేయాలి.  అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడానికి రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడి పెట్టాలి (ఆయా దేశాలలో స్థలం కోసం).

ఈ CAPEXకు గానూ 200 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసారు.  ఈ 200 కోట్లు తెచ్చుకోవడానికి కంపెనీకు ఇప్పుడున్న మార్గాలు:

 1. ఇంటర్నల్ అక్రువల్స్ ద్వారా కొంత.
 2. మరొక PE ఇన్వెస్టర్ ద్వారా సిరీస్ – D ఫండింగ్.
 3. బ్యాంకు నుండి కొంత అప్పు.
 4. ‘బాండు’ ఇష్యూ చేయడం ద్వారా కొంత.
 5. IPO ఫైల్ చేసుకోవడం ద్వారా కొంత!

ఈ 5 మార్గాలలో కంపెనీ 200 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది.  మన చాప్టరు ‘IPO’ గురించి కాబట్టి అన్ని మార్గాల గురించీ మనకు అవసరం లేదు.  ఇప్పుడు కంపెనీ కొంత  పెట్టుబడిని ఇంటర్నల్ అక్రువల్స్ ద్వారా తెచ్చుకోగా, మిగతా డబ్బును IPO ఫైల్ చేసుకోవడం ద్వారా రాబట్టుకోవాలని అనుకుంటోంది అనుకుందాం.  IPO ఫైల్ చేయడం అంటే:  కంపెనీ కొన్ని షేర్లను పబ్లిక్ గా అమ్మకానికి పెడుతుంది.  ఎవరైనా ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చు.  కంపెనీ మొట్ట మొదటిసారిగా పబ్లిక్ గా షేర్లను అమ్మకానికి పెడుతుంది కాబట్టి “ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ – IPO” అంటాం.

ఇప్పుడు మన చాప్తరుకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాం. ఇక్కడే మనకు కొన్ని సందేహాలు వస్తాయి.

 • కంపెనీ IPO ఏ ఫైల్ చేయాలని ఎందుకు నిర్ణయించుకుంటుంది?
 • సిరీస్ A, B, C ల సమయంలోనే IPO ఫైల్ చేయవచ్చు కదా?
 • IPO ఫైల్ చేసిన తరువాత ఇప్పటివరకు ఉన్న ఇన్వెస్టర్లు ఏమవుతారు?
 • IPO సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఏం చూడాలి?
 • IPO ప్రాసెస్ ఎలా రూపొందించారు?
 • IPO మార్కెట్లలో ఏయే ఆర్ధిక మధ్యవర్తులు ఉంటాయి?
 • కంపెనీ పబ్లిక్ ఐన తరువాత ఏమవుతుంది?

క్లుప్తంగా – ఈ చాప్టర్లో తెలుసుకున్న అంశాలు:

 • కంపెనీలు పబ్లిక్ గా ఎందుకు షేర్లు అమ్ముతాయో తెలుసుకునే ముందు, కంపెనీలు, వాటి వ్యాపారం గురించి తెలుసుకోవడం ముఖ్యం.
 • కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టేవారిని “ఏంజెల్ ఇన్వెస్టర్స్” అని పిలుస్తారు.
 • ఈ ఏంజెల్ ఇన్వెస్టర్లు అత్యధిక రిస్క్ ను తీసుకుంటారు.  ప్రమోటర్ తీసుకునేంత రిస్క్ వీరిపైనా ఉంటుంది.
 • ఏంజెల్స్ పెట్టే పెట్టుబడిని ‘సీడ్ ఫండ్’ అని పిలుస్తాం.
 • ఈ ఏంజెల్స్ తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడతారు.
 • కంపెనీ విలువను లెక్కించడం అంటే – కంపెనీ ఆస్తులను, డబ్బును, బాధ్యతలను లేక్కించడమే.
 • ఫేస్ వాల్యూ అంటే షేర్ యొక్క అసలు విలువ అని అర్థం.
 • ఆతరైస్ద్ షేర్లు అంటే కంపెనీ వద్ద ఉన్న మొత్తం షేర్లే.
 • ఆతరైస్ద్ షేర్ల నుండి పంపిణీ చేసిన షేర్లను “ఇష్ష్యూ చేసిన షేర్లు” అని పిలుస్తాం.  ఇష్యూ చేసిన ఏ షేర్లు అయినా ఆతరైస్ద్ షేర్ల నుండి ఇచ్చినవే.
 • కంపెనీ షేర్ హోల్డింగ్ ద్వారా ఎవరి దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయో, కంపెనీలో ఎవరికి ఎంత వాటా ఉందో తెలుస్తుంది.
 • వీసీ (Venture Capitalist) లు కూడా కంపెనీ మొదటి దశలలో పెట్టుబడి పెట్టేవారు.  కానీ, వీరు ఏంజెల్స్ తీసుకునేంత రిస్క్ ని తీసుకోరు.
 • వ్యాపార విస్తరణ నిమిత్తం కావాల్సిన డబ్బును CAPEX లేదా కాపిటల్ ఎక్స్పెండిచర్ అని పిలుస్తాం.
 • సిరీస్ A, B, C ఫండింగ్ కంపెనీ పెరుగుతూన్న దశలలో తెచ్చుకునేది.  సాధారణంగా A, B, C లు పెరుగుతూన్న కొద్దీ ఫండ్ ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది.
 • కొంత నిర్ధిష్ట మొత్తాల కంటే వీసీలు ఎక్కువ పెట్టుబడి పెట్టలేరు.  కాబట్టి కంపెనీకు PEలు (ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు) అవసరమవుతారు.  PE సంస్థల దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుంది కాబట్టి వీరు పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెడతారు.  రిస్క్ విషయానికి వస్తే, PEలు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పటికీ తక్కువ రిస్క్ ఉంటుంది.  PE లు పెట్టుబడి పెట్టిన తరువాత వారికి సంబంధించిన వ్యక్తులను బోర్డు మెంబరుగా ఉంచుతారు.  బోర్డు మెంబర్ గా ఉంచడం ద్వారా కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకుంటుందని తెలుసుకుంటారు.
 • వ్యాపారం, ఆదాయం, లాభాలు పెరుగుతూన్న కొద్దీ కంపెనీ విలువ పెరుగుతూ ఉంటుంది.
 • IPO అనేది కంపెనీకు అవసరమైన డబ్బును తెచ్చి పెడుతుంది.  అది ఏ అవసరం అయినా అవ్వొచ్చు.  ఉదాహరణకు CAPEXకు గానీ, అప్పులు తీర్చడానికి గాని, షేర్ హోల్డర్స్ కు బహుమతులు ఇవ్వడానికి కావొచ్చు.  IPO ద్వారా కంపెనీ పబ్లిక్ గా లిస్టు అవుతుంది.  దీని గురించి రేపటి చాప్టర్లో తెలుసుకుందాం.

రేపటి ‘IPO -2‘ చాప్టర్లో వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం.

(గమనిక:  ‘స్టాక్ మార్కెట్ సిరీస్’ ను సాధ్యమైనంత వివరంగానే రాయడానికి ప్రయత్నిస్తున్నాను.  ఇది ఇంకా ప్రారంభదశలోనే ఉంది కాబట్టి, ఇప్పటివరకు వచ్చిన సందేహాలు, అర్థంకానివి, ఇంకా మెరుగ్గా రాయడానికి అవకాశాలేమైనా తోచితే, కామెంట్స్ లో తెలుపండి.)

ఫేస్బుక్ ద్వారా ‘స్టాక్ మార్కెట్’ సిరీస్ అప్డేట్స్ పొందటం కోసం లైక్ చేయండి:

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment