టెక్నాలజీ తెలుగు బ్యాంకులు మరియు చెల్లింపులు

UPI 2.0 వచ్చేసింది..ఇక BHIMలో సూపర్ ఫీచర్లు!

NPCI నుండి గతేడాది విడుదలైన UPI పేమెంట్స్ గురించి మనందరికీ తెలిసిందే. బ్యాంకు వివరాలేవీ అవసరం లేకుండా కేవలం ఒక వర్చువల్ ఐడీ (VPA) ద్వారా పేమెంట్స్ ను దేశంలోని ఏ బ్యాంకుకైనా, ఎప్పుడైనా పంపుకునేందుకు ఈ UPI పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. BHIMతో మొదలుకుని నేడు అందుబాటులో వున్న అన్ని పేమెంట్ అప్లికేషన్లలోనూ UPI అందుబాటులో వుంటోంది.

తాజాగా ఈ UPI పేమెంట్స్‌కు మరో వర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిలోని సదుపాయాలేంటో చూద్దాం.

ఇక చెల్లింపులకు రసీదులు కూడా వస్తాయి

ఇప్పటివరకూ UPI ఆధారిత అప్లికేషన్లద్వారా ఏ చెల్లింపులు చేసినా మీకు పేమెంట్ నిర్థారణ మెసేజ్ మాత్రమే కనిపించేది. ఇకమీదట అదనంగా రసీదులు కూడా వస్తాయి. ఉదాహరణకు ఏదైనా పెట్రోల్ బంకులో లావాదేవీ చేస్తే అందుకు సంబంధించిన రసీదు నేరుగా పెట్రోల్ బంకు నుండే మీ UPI అప్లిఏషన్‌కు / మెయిల్ ఐడీకి వస్తుంది.

సరైన QRకే చెల్లిస్తున్నారా చూడొచ్చు

UPI QR (Quick Response) కోడ్ల ద్వారా చెల్లింపులు పెరుగుతూన్న నేపథ్యంలో నకిలీ QRలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న నిర్ణయమిది. ఉదాహరణకు మీరు ఒక కిరాణా షాపులో UPI QR ద్వారా చెల్లింపు చేస్తూంటే ఆ వ్యాపారి QR రిజిస్టర్ కాబడిందేనా అన్నది ఒక టిక్ మార్క్ రూపంలో చూపిస్తుంది. ఒకవేళ రిజిస్టర్ కాని QR అయితే ఒక వార్నింగ్ మెసేజ్ కూడా చూపిస్తుంది. దానిని బట్టి లావాదేవీపై స్పష్టత ఏర్పడుతుంది.

ఓవర్-డ్రాఫ్ట్ (Overdraft) ఖాతాలను కూడా జతచేసుకోవచ్చు

ఇప్పటివరకు UPI ద్వారా మన సేవింగ్స్, కరెంట్, పేమెంట్స్ బ్యాంకు ఖాతాలను మాత్రమే జతచేసుకోగలం. ఇకమీదట Overdraft ఖాతాలను కూడా జతచేసుకోవచ్చు.

ఇక ఖాతానుండీ లావాదేవీకన్నా ముందే డబ్బు కట్ అవుతుంది (One Time Mandate):

ఉదాహరణకు మీరు Uberలో UPI ద్వారా క్యాబ్ బుక్ చేయాలనుకున్నారు. ప్రస్తుతమైతే మీ రైడ్ పూర్తయిన తరువాత పేమెంట్ చేయమని అడుగుతుంది. ఈ డబ్బు కట్టడానికి ఎటువంటి టైం లిమిట్ లేదు. చాలామంది ఇలా రైడ్ పూర్తయిన తరువాత పేమెంట్ చేయడం కూడ లేదు. పేటీఎం లాంటి వాలెట్స్‌ని లింక్ చేస్తే ముందే ఖాతా నుంచి రైడ్‌కు సంబంధించిన మొత్తాన్నీ మినహాయించి, రైడ్ పూర్తి కాగానే చెల్లిస్తుంది.

అదే సదుపాయం ఇప్పుడు UPI 2.0లో One Time Mandate పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇకమీదట ఇటువంటి లావాదేవీలకు ముందుగానే ఆ రైడ్ కు సంబంధించిన మొత్తం మీ ఖాతా నుండీ మినహాయించబడుతుంది, రైడ్ పూర్తయ్యాక ఒకవేళ మినహాయించిన మొత్తం కన్నా మీ రైడ్ చెల్లింపు తక్కువైతే, మిగిలిన మొత్తం ఖాతాలోకి ఆటోమాటిక్ గా వచ్చేస్తుందన్నమాట.

ఈ-కామర్స్ చెల్లింపులు ఇక డెలివరీ తర్వాత UPI ద్వారా!

Amazon, Flipkart లాంటి ఈ-కామర్స్ సైట్లలో వస్తువులను కొనుగోలు చేసాక Cash on Delivery, Pay on Delivery లాంటి ఆప్షన్లను ఎంచుకుంటుంటాం. ఇకపై UPI ద్వారా కూడా ఈ చెల్లింపులు చేయొచ్చు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ UPI 2.0 ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఇక Amazon డెలివరీ బాయ్ కూడా UPI QR కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరిస్తాడు!

ఈ UPI 2.0 విడుదలైన మొదటి రోజు నుండే State Bank of India, HDFC, Axis, ICICI, IDBI, RBL, Yes Bank, Kotak Mahindra, Indus Ind, Federal Bank, HSBC బ్యాంకులలో అందుబాటులోకి వచ్చింది. UPI చెల్లింపులు ప్రారంభమైన ఈ సంవత్సర కాలంలోనే (2018 జులై చివరి నాటికి) 45వేల కోట్ల మొత్తం చెల్లింపులు, 2.3 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయంటే ఎంత వేగంగా భారీ మొత్తంలో చెల్లింపులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు.

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment

1 Comment

  • సెక్షన్18(1)ప్రకారం అపీల్ ఎవరికి చేయాలి దాని నమూనా ప్రతి మరియు కావలశిన పేపర్లు వివరాలు