బ్యాంకులు మరియు చెల్లింపులు

అందరికన్నా తక్కువ వసూల్ చేసేది మేమే – SBI సమాధానమిది

ప్రభుత్వరంగ బ్యాంకులలో దేశంలోనే పెద్దది. ఏ ప్రభుత్వ పథకానికైనా, ప్రభుత్వోద్యోగికైనా ఉండాల్సిన బ్యాంకు. దేశానికే ఆదర్శంగా ఉండాల్సిన బ్యాంకు. కానీ చేస్తున్న పనులు మాత్రం వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అసలే డబ్బులు లేవని బాధపడుతుంటే బ్యాంకు మాత్రం వారిని ఎగతాళి చేస్తుంది. డబ్బులు లేనివారికి ఫైన్లు, ఉన్నవారికి వడ్డీ! ఇదీ బ్యాంకుల తంతు.

ఇటీవలే ప్రకటించిన గణాంకాల ప్రకారం MAB (Monthly Average Balance – నెలసరి కనీస బ్యాలెన్సు) లేనందుకు గానూ భారతదేశంలోని వివిధ బ్యాంకులు కేవలం ఒక సంవత్సరంలో వసూలు చేసిన మొత్తం అక్షరాలా 5 వేల కోట్లు! ఇందులో అత్యధికంగా వసూలు చేసిన ఘనత SBI దే కావడం విశేషం. వసూలు చేసిన ఐదు వేల కోట్లలో 2400 కోట్లకు పైనే వసూలు చేసింది SBI. దీనిపై సోషల్ మీడియాలో వ్యతిరేఖత రావడంతో ఈరోజు SBI ఒక సమాధానం ఇచ్చింది. అదేమంటే “దేశంలో అతితక్కువ పెనాల్టీ వేసేది మేమే” అని. అది కూడా ఎలా చెప్పిందో వింటే నవ్వక తప్పదు. గత సంవత్సరం మినిమమ్ బాలన్స్ లేని ఖాతాలకు చార్జీలు వసూలు చేస్తామని ప్రకటించిన కొంత కాలానికి వినియోగదారులనుండి తీవ్ర వ్యతిరేఖత వచ్చినందున సగానికి పైగా పెనాల్టీని తగ్గించామని చెప్పుకుంది SBI. పైగా ప్రస్తుతం దేశంలో తక్కువ చార్జీలు వసూలు చేస్తున్న బ్యాంకులలో SBI కూడా ఒకటని.

ఒకవైపు డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించాలని, ఆన్లైన్లో లావాదేవీలు చేసేవారికి రివార్డులు, కాష్ బ్యాక్ లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే బ్యాంకులు మాత్రం అవేమీ పట్టనట్లు ఉంటున్నాయి. ఎప్పుడు నెట్ బ్యాంకింగ్ పని చేస్తుందోతెలీదు. BHIM లాంటి UPI అప్లికేషన్లలో చెల్లింపులు చేయాలంటే సగానికిపైన సమయం సర్వర్ పనిచేయని బ్యాంకులలో మొదట ఉండేది SBI ఏ. OTP లు కూడా సరైన సమయానికి వస్తాయన్న గారెంటీలేదు. బ్యాలెన్స్ తక్కువ ఉండి ఏదైనా లావాదేవీ తెలీక చేస్తే దానికి కూడా బాదుడే.  అది కూడా 20 రూపాయలకు పైనే. తెలీక పెట్రోల్ బ్యాంకులలో స్వయిప్ చేసి ఈ బాదుడికి గురవుతున్నవారెందరో!

విజయ్ మాల్యా లాంటి వారి దగ్గర వసూల్ చెయ్యలేకపోయారేమని ప్రశ్నిస్తే, చేస్తున్నాం..అయితేనేం అతను ఎగ్గొట్టి పోయింది బ్యాంకులకు కేవలం 2 రోజుల వడ్డీ మాత్రమే అని తలపొగరుతో సమాధానాలు చెప్పగలవు కానీ వినియోగదారుల నెత్తిన మాత్రం చార్జీల బాదుడు ఆపుతాం అని అనరు. ఉన్నవాళ్లలో మేమె తక్కువ వసూల్ చేస్తాం అని మాత్రం చెప్పగలవు. అదికూడా వ్యతిరేఖత రాబట్టి. ఆ వ్యతిరేఖత కూడా రాకపోతే ఎంతైనా వసూల్ చేయడానికి వెనుకాడగలవా ఈ బ్యాంకులు?

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment