సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని పొందడం ఎలా? – పూర్తి వివరాలు

ప్రజాస్వామ్యం – ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం – ప్రజలంతా కలసి ఏర్పరచుకున్న రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రభుత్వ విధి విధానలపై నడిచే అనేక కార్యాలయాలు, వాటి ద్వారా నడుస్తున్న పాలన. ఆ పాలన ఎలా జరుగుతుంది? అమలుపరుస్తున్న ప్రణాలికలు, పథకాలు సరిగా అమలవుతున్నాయా? అంతెందుకు మీ గ్రామ పంచాయితీనో, నగర పంచాయితీనో సరిగా నడుస్తుందా? ఎప్పుడైనా ఆలోచించారా? మీ వీధిలోని రోడ్డుకు ఎంత నిధులు విడుదలయ్యాయో మీకు తెలుసా? మీ నగరానికి గతేడాది వివిధ పనులకు గానూ విడుదలయిన నిధులెన్నో మీకు తెలుసా? అవి ఎలా ఖర్చయ్యాయో మీకు తెలుసా? మీరు రాసిన పరీక్ష ప్రశ్నా పత్రం సరిగా దిద్దారో లేదో తెలుసుకోవచ్చన్న సంగతి తెలుసా?

సమాచారం పొందడం నీ, నా, మనందరి హక్కు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతీ పౌరునికీ ఉన్న కనీస హక్కు. ఈ విషయం మీలో ఎంత మందికి తెలుసు? దేశంలోని ఏ ప్రభుత్వ కార్యాలయంలో నైనా..అది ప్రధాని కార్యాలయమైనా, మీ గ్రామ పంచాయితీ కార్యాలయమైనా సరే, కావలసిన సమాచారాన్ని పొందే హక్కు భారత పౌరుడిగా మీకుంది. సమాచార హక్కు చట్టం (2005) ద్వారా ఇది సాధ్యం.

ఏమిటీ సమాచార హక్కు చట్టం?

దేశంలోని ఏ ప్రభుత్వ కార్యాలయం లేదా సంస్థ నుంచైనా సమాచారాన్ని పొందటమే సమాచార హక్కు చట్టం (Right to Information Act). ఈ చట్టం 12 అక్టోబర్ 2005 నుండీ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ తేదీకి ముందు ఈ సమాచారాన్ని పొందే హక్కు కేవలం పార్లమెంటు, విధాన సభ, విధాన పరిషత్ సభ్యులకు మాత్రమే వుండేది. ఈ చట్టం ప్రకారం దేశంలోని ఏ పౌరుడైనా ప్రభుత్వ శాఖలు, సంస్థల నుండి సమాచారాన్ని పొందే హక్కు వుంది.

సమాచారం అంటే? ఏ ఏ సమాచారం పొందవచ్చు?
రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్‌బుక్స్, కాంట్రాక్టులు, నివేదికలు, పేపర్లు, శాంపిళ్ళు, మోడల్స్, డేటా సహా ఎలక్ట్రానిక్ రూపంతో పాటు ఏ రూపంలో నయినా వున్న సమాచారం. అమలులో వున్న చట్టం ప్రకారమయినా ప్రభుత్వ యంత్రాంగం సంపాదించదగిన ఏ ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారమయినా ఈ చట్టం ప్రకారం సమాచారమే.

ఉదాహరణకు రేషన్ డీలర్ కార్డులు, అమ్మకాల వివరాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏటా విడుదలైన నిధులు – వాటిని వేటివేటికి ఖర్చుచేసిన వివరాలు, లబ్దిదారుల వివరాలు, ముఖ్యమంత్రి సహాయనిధి (Chief Minister Relief Fund) లబ్దిదారులు, ప్రజాప్రతినిధులు (MP, MLA) నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎన్నికల కమీషనర్ కార్యాలయం నుండి వివరాలు, ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలు లాంటివి.

  • పనులనూ, పత్రాలనూ, రికార్డులనూ తనిఖీ చేసే హక్కు
  • రికార్డులలో వున్న సమాచారాన్ని ఎత్తి రాసుకోవడం, వాటి నకలులు, సర్టిఫైడ్ కాపీలు తీసుకోవడం
  • సమాచార సంపత్తి సర్టిఫైడ్ శాంపిళ్ళు తీసుకోవడం
  • డిస్కెట్లు, ఫ్లాపీలు, టేపులు, వీడియో కాసెట్ల రూపంలో, లేక మరే విధమైన ఎలక్ట్రానిక్ రూపంలో వున్న సమాచారాన్ని పొందడం; అలాంటి సమాచారం కంప్యూటర్‌లో గానీ, మరోవిధమైన పరికరంలోగానీ నిక్షిప్తమై వుంటే ప్రింట్ అవుట్ల ద్వారా దానిని పొందడం కూడా ఈ హక్కులో భాగం.

సమాచారాన్ని ఎలా పొందాలి?

ముందుగా మీరు పొందాలనుకుంటున్న సమాచారం గురించి ఒక లేఖను “పౌర సమాచార అధికారి, చిరునామా”కు సిద్ధం చేసుకోవాలి (ఒక ఉదాహరణ ఫార్మాటును క్రింద ఉంచాను). లేఖ సిద్ధమయిన తరువాత పోస్టు ఆఫీసులో రూ.10/- IPO (Indian Postal Order) ను ఈ లేఖకు RTI ఫీజుగా జతచేయవలసి వుంటుంది (చెక్కు, డిమాండ్ డ్రాఫ్టు, సంబంధిత ఆఫీసులో డబ్బు కట్టి తీసుకున్న రశీదు – ద్వారా అయినా చెల్లించవచ్చు). ఒకవేళ మీరు (RTI ద్వారా సమాచారం పొందాలనుకుంటున్న వ్యక్తి) BPL (దారిద్ర్య రేఖకు దిగువనున్నవారు) అయితే ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు కానీ, BPL పౌరుడనని నిరూపిస్తూ ఒక ప్రతిని జతచేయాలి (ఉదాహరణకు రేషన్ కార్డు).

ఈ సిద్ధం చేసిన లేఖను సంబంధిత పౌర సమాచార అధికారికి రిజిస్టర్డ్ పోస్టు (Registered Post with Acknowledgement Due) ద్వారా పంపండి. సాధారణ పోస్టు, స్పీడు పోస్టు కూడా చేయవచ్చు కానీ పంపినట్లు మీదగ్గర ఋజువు ఏదీ వుండదు. Registered Post with Acknowedgement పంపితే మీ అప్ప్లికేషను సంబంధిత అధికరికి చేరినట్లు మీకు ఋజువు వుంటుంది.

అంతే, మీ అప్లికేషను చేరినట్లు Acknowledgement వచ్చిన తేదీ నుండీ 30 రోజులలోపు మీరడిగిన సమాచారాన్ని పొందుతారు.

ఒకవేళ సమాచారాన్ని పొందకపోతే?

సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం దరఖాస్తుదారుడు సమాచారాన్ని అభ్యర్థించిన 30 రోజులలోపు సంబంధిత కార్యాలయం సమాచారాన్ని అందజేయాలి. ఒకవేళ అందజేయకపోతే ఎందుకు అందజేయలేదో కూడా తెలియజేయాలి. అలా చేయని పక్షంలో దరఖాస్తుదారుడు పై అధికారికి అప్పీలుకు వెళ్ళవచ్చు. దానికి సంబంధించి కూడా ఒక లేఖను దరఖాస్తు పంపిన తేదీ, అడిగిన వివరాలు, పంపిన చిరునామా వంటి పూర్తి వివరాలతో సంబంధిత శాఖకు చెందిన Appellate Officer కు లేఖ పంపాలి. ఈ లేఖకు సంబంధించి ఒక ఉదాహరణ ఫార్మాటును ఇక్కడ చూడవచ్చు:

సమాచారం ఇవ్వడంలో జాప్యం గురించి అధికారికి లేఖ – ఫార్మాటు:

సమాచారం 30 రోజులలోపు ఇవ్వని పక్షంలో, మీకు వెంటనే ఫిర్యాదు ఇవ్వాలనిపించకపోతే ఈ లేఖ పంపుతూ జాప్యానికి గల కారణాలను అడగవచ్చు.

సమాచారం రానందుకు గానూ పై అధికారికి మొదటి అప్పీలు – ఫార్మాటు:

30 రోజులలోపు సమాచారం మీకు చేరకపోతే ఆ సంబంధిత కార్యాలయపు ప్రజా సమాచార అధికరిపై ఫిర్యాదు చేస్తూ పై అధికారికి అప్పీలు చేసుకోవచ్చు. దీనిని మొదటి అప్పీలుగా పిలుస్తారు. ఒకవేల మొదటి అప్పీలు అధికారి కూడా మీ అప్పీలుపై స్పందించకపోతే మీరు రెండవ అప్పీలుకు వెళ్ళాలి.

మొదటి అప్పీలు చేసినప్పటికీ సమాచారం రానందుకు గానూ కేంద్ర / రాష్ట్ర సమాచార హక్కుకు రెండవ అప్పీలు – ఫార్మాటు:

ఈ రెండవ అప్పీలు కేంద్ర / రాష్ట్ర సమాచర కమీషన్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఇదే అంతిమ అప్పీలు. ఈ స్టేజీలో మొదటి అప్పీలు అధికారిని, ప్రజా సమాచార అధికారినీ, దరఖాస్తు దారున్నీ పిలిపించి సమాచారం అందజేస్తారు. అంతేగాక జాప్యానికి గల కారణాలను వివరిస్తూ, సంబంధిత అధికారులకు పెనాల్టీ కూడా విధిస్తారు.

సమాచార హక్కు చట్టం 2005 తెలుగు ప్రతి:

సమాచార హక్కు చట్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో వుంటాయి. సమాచారం క్రిందకి ఏవేవి వస్తాయి, ఏఏ సమాచారాన్ని అడగకూడదు, ఏఏ సమాచారం ఎన్ని రోజుల్లో పొందవచ్చు, పొందని పక్షంలో ఏమి చేయాలి, ఏఏ అధికారులుంటారు, ఏఏ సమాచారాన్ని / అప్పీళ్ళను ఏఏ అధికారులకి పంపాలి వంటి పూర్తి వివరాలన్నింటికీ మార్గదర్శకం ఈ చట్ట ప్రతియే:

సమాచార హక్కు చట్టం 2005 ఆంగ్ల ప్రతి:

RTI Act గురించీ, లేఖల ఫార్మట్ల గురించి కానీ, ఇతరత్రా ఏ విషయాలపైనైనా సందేహాలున్నా, పై వివరణపై ఏవైనా సలహాలూ, సందేహాలున్నా వ్యాఖ్యల ద్వారా తెలియజేయండి.

1 Comment

Add Yours →

Leave a Reply