తెలుగు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశం

స్టాక్ మార్కెట్ సిరీస్: 2. మార్కెట్ ఎవరి ఆధీనంలో ఉంటుంది?

గమనిక: ఈ చాప్టర్ ‘స్టాక్ మార్కెట్ సిరీస్’ లో భాగంగా రాయబడింది.  కొత్తగా చదువుతున్నవారు ఈ లింక్ లోకి వెళ్లి మొదటి చాప్టర్ నుండి చదవవచ్చు.

‘రెగ్యులేటర్స్’ అంటే తెలుగులో ‘నియంత్రించేవారు’ అని అర్థం.  ఎవరిని నియంత్రించడానికి ఈ ‘రెగ్యులేటర్స్’ ఉన్నాయి? ఎవరా ‘రెగ్యులేటర్లు’? తదితర అంశాలు ఈ చాప్టర్లో తెలుసుకుందాం.

రెగ్యులేటర్స్ గురించి తెలుసుకునేముందు ‘స్టాక్ మార్కెట్’ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం (స్టాక్ మార్కెట్ అనే చాప్టర్ తరువాత రాబోతోంది కనుక ఇక్కడ క్లుప్తంగా రాస్తున్నాను.  స్టాక్ మార్కెట్ సిరీస్ లో స్టాక్ మార్కెట్ కన్నా ముందు ఇవన్నీ ముందే ఎందుకొస్తున్నట్లు? అనే సందేహం రావచ్చు.  స్టాక్ మార్కెట్ గురించి వివరించేటప్పుడు ఈ పదాలన్నీ అవసరంపడతాయి కాబట్టి ‘స్టాక్ మార్కెట్’ చాప్టరు కన్నా ముందే కొన్ని చాప్టర్లు ఉన్నాయి.  ఉదాహరణకు ఈ చాప్టరు టైటిల్ ‘రెగ్యులేటర్స్’.  కానీ ఇందులో కూడా స్టాక్ మార్కెట్ గురించి కొంత రాసి ఉంటుంది.  అలాగే ప్రతీ చాప్టరులో టైటిల్ లో చెప్పినదే కాక మరికొన్ని అంశాలు కూడా ఉంటాయి.  అది నిన్నటి ‘ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెట్టాలి‘ చదివినవారికి అర్థమయ్యే ఉంటుంది.).

2.1: ‘స్టాక్ మార్కెట్’ అంటే ఏమిటి?

ద్రవ్యోల్భణంతో (Inflation) పోరాడాలంటే, ద్రవ్యోల్భణం కన్నా ఎక్కువ రాబడి తెచ్చుకోవాలని, దానికి ఉన్న 4 మార్గాలలో ఈక్విటీ మార్కెట్లే ఉత్తమం అని నిన్నటి చాప్టర్లో తెలుసుకున్నాం.  మరి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడం ఎలా? పెట్టుబడి పెట్టే ఈక్విటీ మార్కెట్లు సురక్షితమేనా?  ఈక్విటీ మార్కెట్లు ఎవరి ఆధీనంలో నడుస్తాయి?  ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఇంటిదగ్గర్లోని కిరాణా షాపుకో, సూపర్ మార్కెట్ కో వెళ్లి నిత్యావసర వస్తువుల్ని ఎలాగైతే కొనుగోలు చేస్తామో, అలానే ‘స్టాక్ మార్కెట్’ కు వెళ్లి ‘ఈక్విటీ’ లను (ఈక్విటీ అంటే సమంగా విభజించబడినవి అని అర్థం, ఈక్విటీ షేర్లు అంటే ఒకే రేటు కలిగిన షేర్లు అని అర్థం. వీటి గురించి కూడా వచ్చే చాప్టర్లలో మరింత వివరంగా తెలుసుకుంటాం) కొనుక్కుంటాం.  ఈక్విటీలను ఎవరు లావాదేవీ చేయదలచుకున్నా ‘స్టాక్ మార్కెట్’ ద్వారానే చేయాలి. సింపుల్‌గా ‘స్టాక్ మార్కెట్’ అనేది ‘ఈక్విటీ’ (షేర్) లను కొనుగోలు / అమ్మకం చేసే ప్రదేశంగా చెప్పుకోవచ్చు.  లావాదేవి అంటే కొనడం, అమ్మడం అని మనకు తెలిసిందే.  ఈక్విటీలను ప్రతిరోజూ లక్షలమంది కొంటూ, అమ్ముతూ ఉంటారు కనుక, ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి ఫిసికల్ గా షేర్లు కొనడం సాధ్యపడదు కాబట్టి ‘స్టాక్ మార్కెట్’ ను ఏర్పాటు చేసారు. ఎవరు? తెలుసుకుందాం.

‘స్టాక్ మార్కెట్’ యొక్క ప్రధాన ఉద్దేశం ‘ఈక్విటీ’ లావాదేవీలు చేసేందుకు సహాయం చేయడమే.  అంటే, ఇప్పుడు మనం ఒక షేర్ ను కొనుగోలు చేయాలనుకుంటే, ‘స్టాక్ మార్కెట్’ ఒక షేర్ ను అమ్మే వ్యక్తిని చూపిస్తుంది.  అలాగే మీరు ఒక షేర్ ను అమ్మాలనుకుంటే, ఒక షేర్ కొనుగోలు చేసే వ్యక్తిని చూపిస్తుంది.

‘స్టాక్ మార్కెట్’ కిరాణా షాపులానో, సూపర్ మార్కెట్లానో ఒక బిల్డింగ్ లోనో ఇంకోచోటనో ఫిసికల్ గా ఉండదు.  పూర్తిగా ‘ఎలక్ట్రానిక్’ రూపంలోనే ఉంటుంది.  మీ కంప్యూటర్ / స్మార్ట్ ఫోన్ ద్వారా ‘స్టాక్ మార్కెట్’ లో లావాదేవీలు చేయవచ్చు.  స్టాక్ మార్కెట్ లో ఈక్విటీ లావాదేవీలు చేయడానికి ‘మధ్యవర్తి సంస్థలు’ (Brokerage Firms) ఉంటాయి.  వీటి ద్వారా మాత్రమే లావాదేవీలు చేయడం కుదురుతుంది.  ఈ స్టాక్ బ్రోకర్ల గురించి తరువాత వివరంగా తెలుసుకుందాం.

మన దేశంలో రెండు ముఖ్య స్టాక్ ఎక్స్చేంజిలు ఉన్నాయి. అవి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE).  ఈ రెండే కాక బెంగళూర్ స్టాక్ ఎక్స్చేంజ్, మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి చిన్న చిన్న ఎక్స్చేంజిలు చాలానే ఉన్నాయి కానీ ఇవి మనకు ఏవిధంగా ఉపయోగపడవు, భవిష్యత్తులో ఉండవు కూడా.

2.2 స్టాక్ మార్కెట్ లో ఎవరెవరు పాల్గొంటారు?  స్టాక్ మార్కెట్లను నియంత్రించాల్సిన అవసరం ఏమిటి?

స్టాక్ మార్కెట్లో వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు, కార్పోరేట్ కంపెనీలు, ఫారినర్లు..ఇంకా చాలామంది పెట్టుబడులు పెడుతుంటారు.  స్టాక్ మార్కెట్లో ఎవరు లావాదేవీ చేసినా వారిని ‘పార్టిసిపెంట్’ అంటారు.  ఈ ‘పార్టిసిపెంట్లు’ అనేక రకాలుగా ఉంటారు.  వాళ్ళు:

 1. దేశీయ రిటెయిల్ పార్టిసిపెంట్లు – అంటే సాధారణంగా మనలాగా లావాదేవీలు చేసేవాళ్ళు.
 2. NRIలు, OCIలు: వీళ్ళు విదేశాలలో ఉన్న భారతీయులు.
 3. దేశీయ సంస్థలు: భారతదేశంలో నెలకొల్పబడిన పెద్ద సంస్థలు.  ఉదాహరణకు LIC (Life Insurance Company).
 4. దేశీయ ఆస్తి నిర్వహణ సంస్థలు (Domestic Asset Management Companies): ఇందులో చాలావరకు మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ లాంటివి ఉంటాయ్ .  ఉదాహరణకు SBI మ్యూచువల్ ఫండ్, DSP బ్లాక్ రాక, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, HDFC AMC..లాంటివి.
 5. విదేశీ సంస్థల పెట్టుబడిదారులు: విదేశీ కార్పొరేట్ కంపెనీలు.  ఇవి కూడా ఆస్తి నిర్వహణ కంపెనీల లాంటివే.

ఏ రకంవారు, ఎవరు అనేది పక్కన పెడితే, ఎవరైనా పెట్టుబడులు పెట్టేది ‘లాభం’ కోసమే.  ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే – డబ్బు సృష్టించుకోడానికే!

డబ్బు సృష్టించడానికి కొంత ‘డబ్బు’ కావలి.  ఈ ‘డబ్బు’ రంగంలోకి వచ్చినప్పుడు సాధారణంగానే మనిషి భావోద్వేగాలకు గురవుతాడు.  ఆ భావోద్వేగాలు కూడా తారాస్థాయిలో ఉంటాయి.  వాటికి లోనయ్యే కొన్ని తప్పులు చేస్తుంటాడు.  భారతదేశంలో అలాంటి తప్పులు కొన్ని జరిగాయి.  ఉదాహరణకు Harshad Mehta స్కాం లాంటివి (Harshad Mehta అనేది ఒక స్టాక్ బ్రోకర్, 4000 కోట్ల స్కాం జరిగింది.  దీనిగురించి మరింత వివరంగా గూగుల్ లో సర్చ్ చేసి తెలుసుకోవచ్చు).

ఇలాంటి స్కామ్‌లు జరగకుండా ఉండాలంటే, ఈ ‘స్టాక్ మార్కెట్’ కు కొన్ని నియమాలు ఉండాలి, ఆ నియమాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా లాంటి అంశాలు చూడటానికి ఒక ‘నియంత్రణ సంస్థ’ (రెగ్యులేటర్) అవసరం. ఇప్పుడు ‘రెగ్యులేటర్’ గురించి తెలుసుకుందాం.

2.3: రెగ్యులేటర్:

మన దేశంలో స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ – ‘సేక్యురిటీస్ & ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’, సెబి (SEBI) గా కూడా పిలుస్తారు.  సెబి ఏర్పాటు చేయబడిన ఉద్దేశం స్టాక్ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయడం, రిటెయిల్ ఇన్వెస్టర్ల (పెట్టుబడిదారుల) ఆసక్తిని కాపాడటం, మార్కెట్ పార్టిసిపెంట్లను, ఆర్ధిక మధ్యవర్తులను (Financial Intermediaries) నియంత్రించడం.  సెబి ఏం చేస్తుందో కాస్త వివరంగా:

 • స్టాక్ ఎక్స్చేంజ్ లు (BSE & NSE) వాటి విధులను సక్రమంగా నిర్వర్తించేలా చూడటం.
 • స్టాక్ బ్రోకర్లు, వాటి సబ్ బ్రోకర్లు సరిగా నిర్వహించేలా చూడటం.
 • మార్కెట్ పార్టిసిపెంట్లు ఎటువంటి తప్పులు చేయకుండా చూడటం.
 • కార్పొరేట్లు ‘మార్కెట్’ను ఉపయోగించి తప్పులు చేయకుండా చూడటం (ఉదాహరణకు ‘సత్యం కంప్యూటర్స్ స్కాం’ – దీని గురించి కూడా గూగుల్ లో వెతకండి.)
 • చిన్న పెట్టుబడిదారుల ఆసక్తిని కాపాడటం.
 • పెద్ద పెట్టుబడిదారులు ‘మార్కెట్’ను ప్రభావం చేయకుండా చూడటం.
 • మొత్తంగా ‘మార్కెట్’ అభివృద్దికి కృషి చేయడం.

పైన చెప్పినవన్నీ చేయడానికి ‘సెబి’ ఈ క్రింద టేబుల్ లో చూపబడిన సంస్థలను రెగ్యులేట్ చేయవలసి ఉంటుంది.  క్రింద చూపబదినవన్నీ ‘మార్కెట్’లో డైరెక్ట్ గా పాల్గొంటాయి.  వీటిలో ఏ ఒక్కటి వాటి విధులను దుర్వినియోగపరిచినా ‘మార్కెట్’పై భారీగా ప్రభావం ఉంటుంది.

ఈ క్రింద చూపబడిన ఎంటిటిలు అన్నీ ‘సెబి’ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే నడుచుకుంటాయి.  ప్రతీ ఎంటిటికు ప్రత్యేకంగా నియమాలను ‘సెబి’ ఇచ్చింది, ఇస్తూంటుంది.  ఆ నియమాలను వాటి వెబ్సైట్లలోని ‘లీగల్ ఫ్రేమ్‌వర్క్’ పేజిలో ఉంచుతారు.  ఆ ఎంటిటిలు, వాటి గురించి క్లుప్తంగా:

(ఈ టేబుల్ లో కూడా చాలా పదాలు అర్థం కావు.  ఉదాహరణకు IPO లాంటివి. అవన్నీ కూడా మున్ముందు చాప్టర్లలో తెలుసుకుంటాం.)

క్లుప్తంగా – ఈ చాప్టర్లో తెలుసుకున్న అంశాలు:

 • స్టాక్ మార్కెట్ అనేది ఈక్విటీ లావాదేవీలు జరిగే ప్రదేశం.
 • స్టాక్ మార్కెట్ పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే ఉంటుంది.  దానిని ‘స్టాక్ బ్రోకర్’ ద్వారా ఆక్సెస్ చేస్కుకోవచ్చు.
 • స్టాక్ మార్కెట్లో అనేక రకాల వ్యక్తులు / కంపెనీలు పాల్గొంటాయి.
 • మార్కెట్లో పాల్గొనే ప్రతీ ‘ఎంటిటీ’ నియంత్రించబడుతుంది.  అవన్నీ ‘రెగ్యులేటర్’ ఆధీనంలో పనిచేస్తాయి.
 • భారతదేశంలో ‘సెబి’ ఏ ఈక్విటీ మార్కెట్లను సంరక్షించే నియంతృత్వ సంస్థ.  ‘సెబి’ ‘లీగల్ ఫ్రేమ్‌వర్క్’ లోనే మార్కెట్ ను ప్రభావం చేసే ఎంటిటిలు పని చేస్తాయి.
 • ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసినది, ‘సెబి’కి మనం చేసే ప్రతీ లావాదేవీ తెలుసు!  ఏదైనా తప్పు చేద్దామని చుస్తే చర్య తీసుకుంటుంది.

ఇంతటితో ‘మార్కెట్ ఎవరి ఆధీనంలో ఉంటుంది’ చాప్టర్ పూర్తయింది. రేపు ఈ ‘ఆర్ధిక మధ్యవర్తులు’ (Financial Intermediaries) గురించి వివరంగా తెలుసుకుందాం.

(గమనిక:  ‘స్టాక్ మార్కెట్ సిరీస్’ ను సాధ్యమైనంత వివరంగానే రాయడానికి ప్రయత్నిస్తున్నాను.  ఇది ఇంకా ప్రారంభదశలోనే ఉంది కాబట్టి, ఇప్పటివరకు వచ్చిన సందేహాలు, అర్థంకానివి, ఇంకా మెరుగ్గా రాయడానికి అవకాశాలేమైనా తోచితే, కామెంట్స్ లో తెలుపండి.)

ఫేస్బుక్ ద్వారా ‘స్టాక్ మార్కెట్’ సిరీస్ అప్డేట్స్ పొందటం కోసం లైక్ చేయండి:

 

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment