ఇక మనభాషలోనే మన డొమైన్లు వచ్చేస్తున్నాయ్!

మొదటినుండీ ఇంగ్లీష్ ఆధిపత్యం ఇంటర్నెట్ లో కొనసాగుతూనే వుంది. యూనికోడ్ పుణ్యమా అని గత కొన్ని సంవత్సరాలుగా మన భాషలు ఇంటర్నెట్ లో అందుబాటులోకి వచ్చినా ఇంకా అనేక చోట్ల వాడుకోలేని పరిస్థితి. ఈమధ్య కాలంలో ప్రాంతీయ భాషలకు ప్రాముఖ్యత పెరుగుతూ వస్తోంది. తాజాగా ఇక డొమైన్ పేర్లను కూడా మన ప్రాంతీయ భాషల్లోనే ఉంచుకోవడానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

ICANN (Itnernet Corporation for Assigned Names and Numbers) అనే ఒక నాన్-ప్రాఫిట్ (లాభాపేక్షలేని) సంస్థ అంతర్జాతీయంగా డొమైన్ పేర్లన్నింటి (DNS) నిర్వహణను చూస్తుంది. ఈ సంస్థ గత కొద్ది కాలంగా మన దేశంలోని 22 భాషలలో డొమైన్ పేర్లను అందుబాటులోకి తీసుకొచ్చేనందుకు చేస్తున్న కృషి ఇప్పుడొక కొలిక్కి వచ్చింది. మొదటగా దేశంలోని 9 భాషలకు (తెలుగు, తమిళం, మలయాళం, ఒరియా, కన్నడ, గురుముఖి, గుజరాతీ, దేవనాగరి, బెంగాలీ) సంబంధించి డొమైన్ పేర్లు వాడుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా వున్నాయి. ఈ సదుపాయానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం, ఏవైనా సలహాలూ సూచనలూ ఇవ్వాలనుకుంటున్నవారూ ఈ లంకెను చూడండి.

ప్రస్తుతం ICANN ఈ డొమైన్ పేర్లను అంతర్జాతీయంగా వాడుకునేందుకుగానూ కావాల్సిన పర్మిషన్లను పొందే పనిలో వుంది. ప్రపంచమంతటా డిజిటల్ వాడకం పెరుగుతోన్న నేపథ్యంలో ప్రాంతీయ భాషలకు తగిన ప్రాముఖ్యతను ఇవ్వకపోతే అవి మరుగున పడే అవకాశముంది. డొమైన్ పేర్లు, ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ సాఫ్ట్వేర్లు లాంటివన్నీ ప్రాంతీయ భాషలపై దృష్టి పెట్టడం శుభపరిణామమే. ఇంటర్నెట్ ను యాక్సెస్ చేసుకునేందుకు ఆంగ్ల భాష తెలిసి ఉండాలన్న అడ్డంకి అతి త్వరలోనే పోనుంది.

ఈ సదుపాయం వచ్చిన తరువాత తెలుగు భాషలో వున్న డొమైన్లు తెలుగులోనే టైపు చేసి తెరవచ్చు. ఏభాషవారు ఆ భాషలోనే డొమైన్లను తెరవచ్చు. అయితే దీనికోసం ఇప్పటికే వున్న ఇంగ్లీష్ డొమైన్ ను వదులుకోవాల్సిన అవసరంలేదు. ప్రస్తుతం మీ వెబ్సైటుకు వున్న ఇంగ్లీష్ డొమైన్ కు ఈ తెలుగు డొమైన్ ను అదనంగా వుంచుకోవచ్చు. లేదా ఇంగ్లీషులో టైపు చేసినా తెలుగు డొమైన్కు ఆటోమాటిక్ గా రీడైరెక్ట్ అయ్యేలా పెట్టుకోవచ్చు.

Leave a Reply