వార్తలు

ఇక ఆధార్‌లో చిరునామా మార్చడం చాలా సులభం

ఆధార్ కార్డులో చిరునామా మార్చాలంటే అనేక చిక్కులు. సొంత ఇళ్ళు లేనివారైతే వారి బాధలు వర్ణణాతీతం. తరచుగా ఇళ్ళు మారుతుండేవారు ఆధార్‌లో సరైనా చిరునామా వుండక, దానిని సులభంగా మార్పించలేక ఇబ్బందులు పడుతుంటారు. వీటికి త్వరలోనే పరిష్కారం లభించనుంది. ఆధార్‌లో చిరునామా మార్చుకునేందుకు UIDAI సంస్థ సులభమైన పరిష్కారాన్ని కనుగొంది.

మనం కొత్త బ్యాంకు ఖాతా తెరిచినప్పుడు ATM, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పిన్‌లను ఎలాగైతే పోస్టులో పంపిస్తారో, UIDAI నుండి కూడా ఆధార్‌కు సంబంధించి మీరు మార్చాలనుకుంటున్న కొత్త చిరునామాకు పోస్టు ద్వారా ఒక సీక్రెట్ పిన్‌ను పంపిస్తుంది. అది మీకు చేరి, ఇంటర్నెట్‌లో (ఆధార్ SSUP – Self Service Update Portal) ఎంటర్ చేస్తే చాలు. మీ ఆధార్ చిరునామా వెంటనే మారిపోతుంది.

ఈ సదుపాయాన్ని జనవరి 1, 2019 నుండి పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి, దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2019 నుండి అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. అద్దె ఇళ్ళలో వుండేవారూ, తరచుగా వేర్వేరు ప్రదేశాలకు మారుతుండే ఉద్యోగులకు ఇది తీపి కబురే.  ప్రస్తుతం ఆధార్‌లో చిరునామా మార్చాలంటే ఆధార్ యాక్టు ప్రకారం మీ కొత్త ఇంటి చిరునామా వున్న పాస్‌పోర్టు, బ్యాంకు పాస్‌బుక్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్సు, కిరాయినామా, పెళ్ళి ధృవీకరణ పత్రం లాంటి పత్రాలను సమర్పించాల్సి వుంది. నిజానికి వీటిలో సగానికి పైగా డాక్యుమెంట్లను పొందడానికి ఆధార్ కార్డునే అడ్రస్ ప్రూఫ్‌గా అడుగుతున్నారు!

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment