జ్ఞానం టెక్నాలజీ

వాట్సాప్ లో నకిలీ వార్తలను ఆపడం సాధ్యమేనా?

ఇటీవల కాలంలో వాట్సాప్ లో విచ్చలవిడిగా స్పామ్ కంటెంట్ పెరుగుతూ వెళ్తోందన్నది జగమెరిగిన సత్యం. తప్పుడు వార్తలతో అనేకసార్లు, అనేకచోట్ల పోలీస్ స్టేషన్లలో నకిలీ కంప్లెయింట్లు కూడా పెరిగాయి.  “మా అబ్బాయి అలిగి ఇంటినుండి వెళ్ళిపోయాడు, కనిపిస్తే దయచేసి క్రింది వారిని సంప్రదించండి” అంటూ ఒక మెసేజ్ వాట్సాప్ లో షేర్ అవుతోంది.  అది నిజమైన మేసేజో అబద్ధమో తెలియదుకానీ, పోయేదేముందిలే అని దానిని తెలిసిన అన్ని గ్రూపులకూ చాలామంది ఫార్వార్డ్ చేస్తూనే ఉంటారు. అందులో ఎప్పుడు తప్పిపోయింది ఉండదు, ఒకవేళ దొరికిన వివరాలూ వుండవు. ఏళ్ళ తరబడి ఇలాంటి మెసేజిలు ఫార్వార్డ్ అవుతూనే ఉంటాయి. “అర్జంటుగా కాంటినెంటల్ హాస్పిటల్లో O+ve రక్తం కావాలి, క్రింది దయచేసి షేర్ చేయండి, క్రింది నంబర్లకు కాంటాక్ట్ చేయండి” అని ఒక మెసేజ్ వస్తుంది. ఇందులో అది ఏ గంట క్రితమే ఉండదు. ఈ మెసేజ్ కూడా ఏళ్ళ తరబడి ఫార్వార్డ్ చేయబడుతూనే ఉంటుంది. మోడీ కొత్త స్కీం..ఈ మెసేజిను పదిమంది స్నేహితులకు, గ్రూపులకు ఫార్వార్డ్ చేయండి, 500 రూపాయలు మీ ఫోనుకు రీఛార్జ్ వస్తుంది అని ఒక స్పామ్ లింక్ ను షేర్ చేస్తుంటారు. ఆ లింక్ క్లిక్ చేస్తే ఫోన్లో Ransomware లాంటి ప్రమాదకర వైరస్లు వస్తుంటాయి.

ఒక కంప్లెయింట్ ప్రకారం “మహారాష్ట్రలోని ఒక జిల్లాలో ముసుగు దొంగలు తిరుగుతున్నారు, ఇలా మీ వీధిలో కనిపిస్తే జాగ్రత్త” అంటూ ఒక నకిలీ వార్తను విచ్చలవిడిగా ప్రచారం చేశారు. దీనిని నమ్మిన కొందరు అలా అనుమానం వచ్చినవారిని చితకబాదారు. కేవలం ఒక నకిలీ వార్త ప్రభావమిది. దీనిమీద పోలీస్ కేసు కూడా నమోదయింది. గత ఏడాది కాలంలోనే వాట్సాప్ లోని నకిలీ వార్తల వాళ్ళ 31 మంది చనిపోయినట్లు పోలీసు గణాంకాలు చెప్తున్నాయంటే సమస్య ఎంత తీవ్రంగా వుందో అర్థంచేసుకోవచ్చు.

ఇటీవల వాట్సాప్ సంస్థ “End to End Encryption” ప్రోటోకాల్ ను ప్రారంభించింది. ఈ ప్రోటోకాల్ ప్రకారం మెసేజ్ పంపే వ్యక్తి, అందుకునే వ్యక్తికీ తప్ప ఆ మెసేజ్ ఇంకెక్కడా స్టోర్ అవ్వదు. వాట్సాప్ సర్వర్లలో కూడా ఆ మెసేజ్ పంపించిన వెంటనేతీసివేయబడుతుంది. వినియోగదారుల ప్రైవసీని కాపాడే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి వాట్సాప్ సంస్థ కూడా ఫిల్టర్ చేయడానికి పెద్దగా ఆస్కారం లేదని అంటోంది.

ఈ “Fake news” కు అడ్డకట్ట వేయడానికి ఇటీవలే ఫార్వార్డ్ మెసేజిలకు “Forwarded” అని కనిపించేట్లు పెట్టి వాట్సాప్ సంస్థ చేతులుదులుపుకుంది.  కేవలం “Forwarded” అని కనిపించినంత మాత్రాన నకిలీ సమాచారాన్ని గుర్తించలేరని, నకిలీ వార్తలను అడ్డుకట్ట వేయడానికి తగిన సాఫ్ట్వేర్ మార్పులను చేయాలని భారత ప్రభుత్వం వాట్సాప్ సంస్థను ఆదేశించింది. దీనికిగాను వాట్సాప్ సంస్థ భారతదేశంలో “Fake News Verification Model”ను ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం కొన్ని నిర్ణీత పదాలను జల్లెడపట్టి ఆ పదాలు గనుక మెసీజీలలో ఉంటే వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అయ్యేలా చేయవచ్చు, అలానే ఫార్వార్డ్ చేసేవారిని కూడా అది నకిలీమెసేజ్ అయ్యి ఉండవచ్చు అని తెలుపవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో ఈ సాఫ్ట్వేర్ మార్పులను చేయనున్నట్లు వాట్సాప్ తెలిపింది.

Election Code అమలులో వుండే సమయంలో అయితే రాజకీయనాయకుల హామీల గురించి కోకొల్లలుగా నకిలీ వార్తలు షేర్ అవుతూ ఉంటాయి. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే సమయం ఉండదు కానీ, ఓటర్లు మాత్రం భారీ సంఖ్యలో ప్రభావితం అవుతారు. 2014 ఎన్నికలలో సోషల్ మీడియా ప్రభావం గురించి ప్రత్యేకించి చెప్పనవసరంలేదు.

అటు భారత ప్రభుత్వం ఇప్పటికే వాట్సాప్ సంస్థకు నకిలీ వార్తలను ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినా, వాట్సాప్ సంస్థ ఎన్ని ఫిల్టర్లను ప్రవేశపెట్టినా, వినియోగదారులు ఆలోచించకుండా గుడ్డిగా వచ్చిన ప్రతీ మెసేజిను నమ్మి ఫార్వార్డులు చేసుకుంటూ పోతే నకిలీ సమాచారానికి అడ్డుకట్ట వేయడం అసాధ్యమనే చెప్పాలి. వచ్చిన మెసేజిలో కంటెంట్/వీడియో నిజమా కాదా, అది పక్కవాడికి అవసరమా, ఫార్వార్డ్ చేయాల్సిన అవసరం ఏంటి లాంటి విషయాలను ఆలోచించనంత కాలం నకిలీ వార్తలు చలామణీలో ఉంటాయనడంలో సందేహం అవసరంలేదు.

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment