తెలుగు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశం

స్టాక్ మార్కెట్ సిరీస్: 3. మార్కెట్లో మధ్యవర్తులు – వాటి పాత్ర

గమనిక: ఈ చాప్టర్ ‘స్టాక్ మార్కెట్ సిరీస్’ లో భాగంగా రాయబడింది.  కొత్తగా చదువుతున్నవారు ఈ లింక్ లోకి వెళ్లి మొదటి చాప్టర్ నుండి చదవవచ్చు.

భవిష్యత్తులో మనం షేర్లను కొన్నదగ్గరనుండి అవి మన ‘డీమాట్’ (డీమాట్ గురించి క్రింద వివరించాను) ఎకౌంటుకు చేరేవరకు అనేక మధ్యవర్తులు ముఖ్య పాత్రలు పోషిస్తాయి. ఈ మధ్యవర్తులన్నీ ఏం చేస్తాయనేది మనకు నేరుగా షేర్లను కొనేప్పుడు, అమ్మేప్పుడు తెలియదు కానీ ఏం చేసినా ‘సెబి’ ఆదేశానుసారమే చేస్తాయని నిన్నటి ‘మార్కెట్ ఎవరి ఆధీనంలో ఉంటుంది’ లో తెలుసుకున్నాం.  ఈ మధ్యవర్తులను ‘ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్’ (ఆర్ధిక మధ్యవర్తులు) గా పిలుస్తారు.  ఈ మధ్యవర్తులన్నీ కూడా ఒకదానితో మరొకటి సంబంధం లేకుండానే, వాటికదే ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ మార్కెట్ నడవడానికి తోడ్పడతాయి.  ఈ చాప్టర్లో ఈ ‘ఆర్ధిక మధ్యవర్తులు’ గురించి తెలుసుకుందాం.

3.1: స్టాక్ బ్రోకర్:

స్టాక్ మార్కెట్లో, మధ్యవర్తులలో తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశాలలో ఈ ‘స్టాక్ బ్రోకర్’ ఒకటి.  ఈ ‘స్టాక్ బ్రోకర్’ స్టాక్ ఎక్స్చేంజిలో లైసెన్స్ కలిగిన ట్రేడింగ్ మెంబర్ గా ఉంటుంది.  ఇది కూడా ‘సెబి’ అడుగుజాడల్లోనే నడుస్తుంది.

షేర్లను కొనాలన్నా, అమ్మాలన్నా ‘స్టాక్ బ్రోకర్’ ద్వారానే సాధ్యపడుతుందని ఇప్పటికే తెలుసుకున్నాం.  ఈ లావాదేవీలు చేయడానికి ఒక ‘ట్రేడింగ్ ఎకౌంటు’ను స్టాక్ బ్రోకర్ ద్వారా ఓపెన్ చేయాలి.  ఈ స్టాక్ బ్రోకర్ ను ఎంచుకోవడం కూడా ముఖ్యమైన విషయమే.  సరైన బ్రోకర్ ను ఎలా సెలక్ట్ చేసుకోవాలనే చాప్టర్ మున్ముందు రాబోతోంది.

ట్రేడింగ్ ఎకౌంటు అంటే:  షేర్లను కొనాలన్నా, అమ్మాలన్నా ఏదోక స్టాక్ బ్రోకర్ ద్వారానే సాధ్యపడుతుంది. ఆ బ్రోకర్ దగ్గర తీసుకునే ఎకౌంటే ‘ట్రేడింగ్ ఎకౌంటు’.  దీని ద్వారానే లావాదేవీలు చేస్తాం.

లావాదేవీలు చేసుకోవడానికి బ్రోకర్ ను సంప్రదించడం ఎలా?

ఏ లావాదేవీ అయినా బ్రోకర్ ద్వారానే చేయాలి కదా. మరి ఆ బ్రోకర్ ను ప్రతీసారీ సంప్రదించడం ఎలా?

 1. డైరెక్ట్ గా బ్రోకర్ ఆఫీసుకు వెళ్లి అక్కడ డీలర్ ను కలిసి లావాదేవీలు చేయించుకోవడం ఒక పద్ధతి.  మీ అనుమతితో మీ ‘ట్రేడింగ్ ఎకౌంటు’ ద్వారా మీరు చెప్పినట్టు ఆ డీలర్ చేస్తాడు.  ఇది పాత, ఔట్ డేటెడ్ పద్ధతి.  ఇప్పుడెవరూ ఈ పద్ధతిని అనుసరించట్లేదు.
 2. బ్రోకర్ను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.  బ్రోకర్ ద్వారా ‘ట్రేడింగ్ ఎకౌంటు’ తీసుకున్నప్పుడు ఒక మొబైల్ ట్రేడింగ్ పాస్-కోడ్ ను మనకు ఇస్తారు.  ఆ కోడ్ చెప్పడం ద్వారా మిమ్మల్ని ధ్రువీకరించుకుని మీ అనుమతితో, మీరు చెప్పిన లావాదేవీలు చేస్తారు.  ఇది కూడా ఔట్ డేటెడ్ పద్ధతే!  ఇప్పుడు చాలా తక్కువమంది వినియోగిస్తున్న పద్ధతి ఇది.
 3. మీ అంతట మీరుగా లావాదేవేలు చేసుకోవడం – ఇదే ఇప్పుడు పాపులర్ పద్ధతి.  బ్రోకర్ మనకు ఒక సాఫ్ట్వేర్ ను అందిస్తారు.  దానినే ‘ట్రేడింగ్ టర్మినల్’గా పిలుస్తారు.  ఎకౌంటు ఓపెన్ చేసుకున్నప్పుడు ఈ ట్రేడింగ్ టర్మినల్ కు సంబంధించిన ఐడి, పాస్వర్డ్, ఎలా ఆపెరేట్ చేసుకోవడం అన్న విషయాలు ఇస్తారు.  వాటిని అనుసరించి మనంతట మనమే మన కంప్యూటర్ / స్మార్ట్ ఫోన్ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు.

పై రెండు పద్ధతులు పాతవే అయినప్పటికీ, ‘నియమం’ ప్రకారం ఇప్పటికీ చేసుకోవచ్చు కానీ మూడవ పద్ధతే సులభం.

బ్రోకర్ ఏయే సదుపాయాలను అందజేస్తారు:

 • మార్కెట్లో లావాదేవీలు చేసుకోవడానికి పైన చెప్పిన మూడు పద్ధతుల సదుపాయాల్ని కల్పిస్తారు.
 • ‘ట్రేడింగ్’ చేసుకోవడానికి మార్జిన్ ఇస్తారు (‘ట్రేడింగ్’ వేరు, ‘పెట్టుబడి’ వేరు. తక్కువ సమయంలో కోని అమ్మితే దానిని ట్రేడింగ్ అంటాం.  చాలా కాలం తర్వాత అమ్మితే ‘పెట్టుబడి’ (Investment) అంటాం. ట్రేడింగ్ మార్జిన్ గురించి తరువాత తెలుసుకుందాం).
 • సహాయం (Helpline) – ఫోన్ చేసి లావాదేవీలు చేయడానికి సహకరిస్తారు.  సాఫ్ట్వేర్ లో ఏవైనా ఇబ్బందులున్నా పరిష్కరించడానికి సహాయం చేస్తారు.
 • చేసిన లావాదేవీలకు ‘కాంట్రాక్ట్ నోట్స్’ ఇస్తారు – మనం చేసిన ప్రతీ లావాదేవీ (కొన్నవి, అమ్మినవి) పూర్తీ వివరాలతో రాతపూర్వకంగా ఇస్తారు. అవే ‘కాంట్రాక్ట్ నోట్స్’.
 • బ్యాంక్ ఎకౌంటు నుండి ట్రేడింగ్ ఎకౌంటు లోకి డబ్బు జమ చేసుకునే సదుపాయం.  ట్రేడింగ్ ఎకౌంటు నుండి బ్యాంక్ ఎకౌంటు కు విత్ డ్రా సదుపాయం.
 • ‘బ్యాక్ ఆఫీస్’ సదుపాయం – అంటే మనం చేసిన లావాదీవీలు, లాభ నష్టాల వివరాలు, ఇతరత్రా పూర్తి వివరాలు ఈ ‘బాక్ ఆఫీస్’ లో అందుబాటులో ఉంటాయి.
 • ఈ సదుపాయాలన్నీ అందించినందుకు గాను ‘బ్రోకరేజ్ చార్జీ’ ప్రతి లావాదేవీపై వసూలు చేస్తుంది.  వీటి మీదనే  బ్రోకరేజ్ సంస్థలు ఆధారపడతాయి.

3.2: డిపాజిటరీ & డిపాజిటరీ పార్టిసిపెంట్లు:

ఏదైనా ఆస్తిని కొనుగోలు చేస్తే అది మనది అని చెప్పుకోడానికి మనకు ‘ఆస్తి పత్రాలు’ ఉంటాయి కదా. ఈ పేపర్లు ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే.  ఈక్విటీ అన్నా షేర్ అన్నా ఒక్కటే అని గత చాప్తర్లో చెప్పుకున్నాం. మనం ఒక కంపెనీ షేర్ ను కొనుగోలు చేస్తే, ఆ కంపెనీలో మనకు కొంత వాటా ఉన్నట్లు. అంటే మనం ఆ కంపెనీలో కొంత ఓనర్ కింద లెక్క.

ఒక షేర్ ను కొన్నప్పుడు కూడా నేనొక షేర్ ను కొన్నాను అని చూపించడానికి ఋజువు ఉండాలి కదా.  ఋజువు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ‘షేర్ సర్టిఫికేట్’ ను చూపించడం.  మనకు ఫలానా కంపెనీలో ఓనర్షిప్ ఉన్నట్లు ఆ సర్టిఫికేట్ లో ఉంటుంది. అదే ఋజువు.

1996 కి ముందు షేర్ సర్టిఫికేట్ పేపర్ రూపంలో ఉండేది.  కానీ, 1996 తర్వాత ఈ షేర్ సర్టిఫికెట్లను డిజిటల్ రూపంలోకి మార్చారు.  ఇలా ఈ షేర్ సర్టిఫికెట్లను పేపర్ నుండి డిజిటల్ రూపంలోకి మార్చిన పద్ధతే ‘డీమాటీరియలైజేషన్’ లేదా ‘డీమాట్’ (DEMAT).

షేర్ సర్టిఫికెట్లను ‘డీమాట్’ రూపంలో భద్రపరచుకోవాలి.  డిజిటల్ గా ఎలా / ఎక్కడ భద్రపరచుకుంటాం?  అలా భద్రపరచుకునే ప్రదేశమే ‘డీమాట్ ఎకౌంటు’.  సింపుల్గా మన డబ్బుల్ని ఎలాగైతే బ్యాంకులలో దాచుకుంటామో అదేవిధంగా షేర్లను ‘డీమాట్ ఎకౌంటు’లో దాచుకుంటాం.  ఈ డీమాట్ సర్వీసులను అందించేదే ‘డిపాజిటరీ’. ‘డీమాట్ ఎకౌంటు’లో మనం కొనుక్కున్న షేర్లు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి.

ఇప్పటికే ‘ట్రేడింగ్ ఎకౌంటు’ , ‘డీమాట్ ఎకౌంటు’ వేర్వేరు అనే విషయం అర్థమయ్యే ఉంటుంది. ‘ట్రేడింగ్ ఎకౌంటు’ బ్రోకర్ అందించగా, ‘డీమాట్ ఎకౌంటు’ను డిపాజిటరీ అందిస్తారు.

ఉదాహరణకు ఇన్ఫోసిస్ కంపెనీలో 10 షేర్లు కొనాలి అనుకుంటే మనకు కావలసినది ‘ట్రేడింగ్ ఎకౌంటు’ మాత్రమే.  ఈ ట్రేడింగ్ ఎకౌంటు కొనడానికి, అమ్మడానికి పనికొస్తుంది.  మరి వాటిని డిజిటల్ గా స్టోర్ చేయడానికి ‘డీమాట్ ఎకౌంటు’ ఉండాలి.  కొన్నప్పుడు షేర్లు డీమాట్ ఎకౌంటులో చేరతాయి. అమ్మినప్పుడు తీసివేయబడతాయి. ఈ రెండు ఎకౌంటులు కూడా బ్రోకర్ ద్వారానే ఓపెన్ చేయవచ్చు.

మన దేశంలో ప్రస్తుతం 2 డిపాజిటరీలు ఉన్నాయి.  అవి నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ [NSDL] & సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ [CDSL].  ఈ రెండింటికీ మధ్య తేడాలేమీ ఉండవు.  రెండూ కూడా ‘సెబి’ నియంత్రణలోనే పనిచేస్తాయి.

3.3: బ్యాంకులు:

మార్కెట్లలో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తాయి.  మనం లావాదేవీ చేయడానికి ‘ట్రేడింగ్ ఎకౌంటు’ ఉంటే సరిపోతుంది కానీ ట్రేడింగ్ ఎకౌంటు లోకి డబ్బు డిపాజిట్ / విత్ డ్రా చేసుకోవాలంటే కేవలం బ్యాంకుల ద్వారానే చేసుకోవాలి.  ‘ట్రేడింగ్ ఎకౌంటు’, ‘బ్యాంక్ ఎకౌంటు’ రెండూ ఒకరి పేరు మీదనే ఉండాలి.  ఆ బ్యాంక్ ఎకౌంటు ద్వారానే డిపాజిట్లు, విత్ డ్రా చేసుకోవడం కుదురుతుంది.  మీ పేరు మీద లేని బాంక్ ఎకౌంటు నుండి డిపాజిట్ / విత్ డ్రా చేసుకోడం కుదరదు.

ఒకవేళ మీకు ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ ఎకౌంటులు ఉంటే, ఆ బ్యాంకులను కూడా మీ ట్రేడింగ్ ఎకౌంటు కు లింక్ చేసుకుంటేనే డిపాజిట్లు / విత్ డ్రా చేసుకోవడం కుదురుతుంది.

సో, ఈక్విటీ లావాదేవీలు చేయడానికి మనకు మూడు ఎకౌంటులు అవసరం.  అవి ట్రేడింగ్ ఎకౌంటు, డీమాట్ ఎకౌంటు, బ్యాంక్ ఎకౌంటు.  ఈ మూడూ డిజిటల్ రూపంలోనే ఉంటూ, ఒకదానితో ఒకటి లింక్ చేయబడి ఉంటాయి.

3.4: NSCCL & ICCL:

NSCCL – నేషనల్ సెక్యూరిటీ క్లియరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ & ICCL – ఇండియన్ క్లియరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్.  ఈ రెండూ ‘నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి’, ‘బాంబే స్టాక్ ఎక్స్చేంజి’ వారి సొంత సంస్థలు.

ఇవి మనం చేసే లావాదేవీలు పూర్తయినట్లు చూసుకునే సంస్థలు.  ఉదాహరణకు ఇన్ఫోసిస్ లో 1 షేర్ ను 900 రూపాయలకు మీరు కొనాలనుకుంటే, 900 రూపాయలకు అమ్మే వ్యక్తి కూడా ఉండాలి.  ఈ లావాదేవీకు మీ ట్రేడింగ్ ఎకౌంటు నుండి 900 రూపాయలు డెబిట్ అవ్వగా, అమ్మిన వ్యక్తికి ఖచ్చితంగా 900 క్రెడిట్ అయ్యి ఉండాలి.  ఈ విషయాలను ధృవీకరించే సంస్థలివి.  సింపుల్గా:

 1. కొనే వ్యక్తిని, అమ్మే వ్యక్తిని మ్యాచ్ చేసి, డెబిట్ – క్రెడిట్ ప్రాసెస్ ను గుర్తిస్తుంది.
 2. ఏ తప్పులు లేకుండా చూడటం – ఈ క్లియరింగ్ కార్పోరేషన్లు లావాదేవీలో ఈ తప్పులు జరగకుండా చూస్తాయి.  ఉదాహరణకు అమ్మేవ్యక్తి షేర్లను అమ్మిన తరువాత ఏ కారణం చేతా వెనక్కి తీసుకునే ఆప్షన్ ఉండదు.  ఆ లావాదేవీ సాఫీగా పూర్తయ్యేలా చూస్తుంది.

ఈ క్లియరింగ్ కార్పోరేషన్ల గురించి ఇంతకన్నా వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు.  మనం ‘ట్రేడింగ్’ / ‘ఇన్వెస్ట్మెంట్’ (పెట్టుబడి)  చేసేప్పుడు వీటితో మనకు ఎలాంటి పనీ ఉండదు కానీ తెలుసుకుని ఉంటే మంచిది కాబట్టి తెలుసుకున్నాం.

క్లుప్తంగా – ఈ చాప్టర్లో తెలుసుకున్న అంశాలు:

 • ఈ మధ్యవర్తులన్నీ వేటికవే కీలక పాత్ర పోషిస్తాయి.
 • స్టాక్ బ్రోకర్ ద్వారా మనం మార్కెట్లో లావాదేవీలు చేసుకోవచ్చు.
 • స్టాక్ బ్రోకర్ మనకు ‘ట్రేడింగ్ ఎకౌంటు’ తదితర సదుపాయాల్ని కల్పిస్తారు.
 • డిపాజిటరీ సంస్థలు షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచుకునేందుకు ‘డీమాట్’ సర్వీసులను అందిస్తాయి.
 • భారతదేశంలో రెండే డిపాజిటరీలు ఉన్నాయి. అవి – NSDL & CDSL.
 • డీమాట్ ఎకౌంటు ఓపెన్ చేయడానికి డిపాజిటరీ పార్టిసిపెంట్ (డి.పీ) అవసరం.  ఈ డి.పీ. లు డిపాజిటరీలకు ఏజెంట్లుగా పనిచేస్తాయి.
 • క్లియరింగ్ కార్పోరేషన్లు లావాదేవీలు సరిగా జరిగేలా చూస్తాయి.

ఇంతటితో ‘మార్కెట్లో మధ్యవర్తులు – వాటి పాత్ర’ చాప్టర్ పూర్తయింది.  రేపటి చాప్టర్లో ‘IPO మర్కెట్స్’ గురించి తెలుసుకుందాం.

(గమనిక:  ‘స్టాక్ మార్కెట్ సిరీస్’ ను సాధ్యమైనంత వివరంగానే రాయడానికి ప్రయత్నిస్తున్నాను.  ఇది ఇంకా ప్రారంభదశలోనే ఉంది కాబట్టి, ఇప్పటివరకు వచ్చిన సందేహాలు, అర్థంకానివి, ఇంకా మెరుగ్గా రాయడానికి అవకాశాలేమైనా తోచితే, కామెంట్స్ లో తెలుపండి.)

ఫేస్బుక్ ద్వారా ‘స్టాక్ మార్కెట్’ సిరీస్ అప్డేట్స్ పొందటం కోసం లైక్ చేయండి:

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment

2 Comments

 • చాలా బాగుంది మీరు రాస్తున్న విధానం 4వ భాగం వ్రాయలేదా? నేను ఈ మధ్యనేచదువుతున్నాను ఈ పుస్తకం బయట దొరుకుతుందా?

  • ధన్యవాదాలు రంగారావు గారూ. ఈ సిరీస్ ను రాస్తున్న క్రమంలోనే ఉద్యోగంలో చేరడం జరిగింది. ఆ తరువాత నాకు తీరిక తక్కువగా ఉంటోంది. ఇప్పటికే పలువురు ఈ సిరీస్ ను కంటిన్యూ చేయమని కోరారు. త్వరలోనే వీలుచూసుకుని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాను.