బ్యాంకులు మరియు చెల్లింపులు

దేశవ్యాప్తంగా ఆగస్టు 21న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ప్రారంభం

భారత రిజర్వు బ్యాంకు (RBI) దేశంలో చెల్లింపులకోసం 2015 నుండి పేమెంట్స్ బ్యాంకులకు లైసెన్సులు ఇవ్వడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలో e-వ్యాలెట్స్ వాడకం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పేమెంట్స్ బ్యాంకుల అవసరం తప్పనిసరైంది. గతకొద్దికాలంలోనే పేటీఎం, ఎయిర్టెల్, జియో లాంటి కార్పొరేట్ సంస్థలు పేమెంట్స్ బ్యాంకుల లైసెన్సులను పొంది వాటికి భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నాయి.

దేశంలో మొట్టమొదటి పేమెంట్స్ బ్యాంకు లైసెన్సును పొందింది మాత్రం మన తపాలా శాఖే. “ఇండియా పోస్ట్స్ పేమెంట్స్ బ్యాంకు (IPPB)” పేరుతో దాదాపు 3 సంవత్సరాల క్రితమే ఈ లైసెన్సును పొందింది. అయితే అందుబాటులోకి తీసుకురావడంలో కాస్త సమయం తీసుకుంది. దీనితో తర్వాత లైసెన్సులు తీసుకున్న పేటీఎం, ఎయిర్టెల్ లాంటి సంస్థలు ముందుగానే పేమెంట్స్ బ్యాంకులను ప్రారంభించాయి.

తాజాగా భారతీయ సమాచార శాఖ ఈ పేమెంట్స్ బ్యాంకును ఆగస్టు 21వ తేదీన ప్రధాని మోడీ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే దేశంలో 2 బ్రాంచీలు సిద్ధంగా ఉన్నట్లూ, 21వ తేదీన దేశంలో 650 బ్రాంచిలలో 3250 అందుబాటు కేంద్రాలలో ఒకేసారి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 11 వేల మంది పోస్ట్ మెన్లు గ్రామీణ, పట్టాన ప్రాంతాల్లో IPPB సర్వీసులను ఇంటింటికీ తిరిగి సేవలను విస్తృతం చేయనున్నారు.

ఇప్పటికే తపాలా కార్యాలయాల్లో ఉన్న 17 కోట్ల పోస్టల్ సేవింగ్స్ ఖాతాలను ఈ పేమెంట్స్ బ్యాంకులో విలీనం చేసేందుకు కూడా కావలసిన అన్ని అనుమతులను పొందినట్లు IPPB ఉన్నతాధికారి సురేష్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైతం తపాలా శాఖల సహాయంతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను IPPB ద్వారా సులువుగా పొందుతారని ఆయన తెలిపారు. IPPB లో లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. RTGS, NEFT, IMPS, UPI సేవలను అందించేందుకు అన్ని అనుమతులూ అందుబాటులో ఉన్నాయి. MGNREGA (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీనోపాధి పథకం)కు చెందిన జీతాలు, ఇతర ప్రభుత్వ సబ్సిడీలు, పెన్షన్లను కూడా IPPB ద్వారా అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆగస్టు 21న IPPB ను ప్రారంభించిన కొద్దిరోజుల తరువాత IPPB కు సంబంధించిన ఆండ్రాయిడ్, ఐఫోన్ యాప్ ను అందుబాటులోకి తేనుంది. దీనిద్వారా IPPB లోని ఖాతాను వాడుకోవటమే కాక ఫోన్ రీఛార్జిలు, విద్యుత్ బిల్లులు, DTH, గ్యాస్ తదితర బిల్లులను కూడా చెల్లించుకోవచ్చు.

Note: To get Aavo Blog updates, join our Telegram and WhatsApp channels - http://bit.ly/aavowtsapp, http://t.me/aavoblog

Leave a Comment