‘వైకుంఠపురములో’ title song lyrics & meaning

[సాహిత్యం (lyrics) మాత్రమే చూడదలచినవారు క్రిందికి స్ర్కోల్ చేయండి]

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చిత్రాల్లోని పాటలు చాలావరకూ సాహిత్య ప్రయోగాలతో వుంటుంటాయి. ‘అల వైకుంఠపురములో` లో కూడా సామజవరగమన (సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు), బుట్ట బొమ్మ (రామజోగయ్య శాస్త్రిగారు) ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. నిన్నటి (6 జనవరి) సంగీత కచేరి వేడుకలో విడుదలైన ‘అలా వైకుంఠపురములో’ పాటలో కూడా మంచి సాహిత్యముంది. ఈ పాటలోని చరణాన్నే ట్రైలర్ లో కూడా వాడారు. ఈ పాట సాహిత్యం అంతర్జాలంలో ఇప్పటివరకయితే అందుబాటులోకి రాలేదు. నేను విన్నది, నాకర్థమయింది ఇక్కడ వుంచుతున్నాను.

ఇందులో ఆకుపచ్చ రంగులో వుంచిన చరణాలు బమ్మెర పోతనగారు రచించిన ‘శ్రీమద్భాగవతం’ లోని గజేంద్ర మోక్షం అనే ఘట్టంలోనిది. స్వచ్ఛమైన మనస్సుతో నిజమైన ఆపద కలిగినప్పుడు పిలిస్తే దేవుడైన ఉన్నఫలంగా అన్నీ వదిలేసి వస్తాడు, అని చెప్పే సంఘటన ఇది.

పూర్వము మహాభక్తుడైన ఒక గంధర్వుడు శాపం వల్ల గజమున్నీ (ఏనుగు) గా జీవిస్తుంటాడు. ఒక కొలనువద్ద దాహం తీర్చుకుంటూండగా ఒక మొసలి ఆ ఏనుగు కాలిని పట్టుకుంటుంది. ఆ ఏనుగు మొసలి నుండి తప్పించుకోవడానికి తన శక్తి మేరా ప్రయత్నిస్తుంది. ఇక తనను తాను రక్షించుకోలేని స్థితిలో శ్రీమహా విష్ణువుని రక్షించమని ప్రార్ధిస్తుంది. ఇలా ఈ గజం ప్రార్ధిస్తుంటే, మరి ఆ మహా విష్ణువు ఎక్కడున్నాడయ్య? అంటే…తన నివాసమైన “వైకుంఠపురం” లో తన భార్య అగు శ్రీదేవితో ఉన్నాడు మాహావిష్ణువు. ఎందరో ఋషులు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు లాంటి వారు తన కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని పక్కనే ఉన్న మేడ సమీపంలోని అమృతపు జలాల సరస్సు దగ్గర చంద్రకాంత శిలపై పరచిన కలువ పూల పాన్పుమీద లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమని దీనముగా ప్రార్థించేసరికి శరణాగతిని గమనించి, ఆ గజముని రక్షించడానికి బయలుదేరతాడు.

మనకు ఒక కష్టమొస్తుంది. ఆ కష్టాన్ని ఎదురుకోవడానికి మనం మన శక్తి మేర ప్రయత్నిస్తాం. కొన్ని సార్లు గెలుస్తాముకూడా. కానీ కొన్ని సార్లు ఒక తోడు, నీ బలంగా నిలిచే చేయూత కావలి. అప్పుడు మన తోడుగా ఒకడు ఉంటారు. అమ్మ, కావచ్చు, నాన్న కావచ్చు స్నేహితుడు కావచ్చు ఎవరైనా, అలా మన కష్టాన్ని గమనించి తాను ఎలాంటి వైభోగం లో ఉన్న అవ్వన్నీ వదిలేసి వచ్చే ఎవరైనా మనకు దేవుడే.. అలాంటి మనిషి ఉండే ఇల్లు పూరి గుడిసే అయినా “వైకుంఠపురమే”.

సాహిత్యం, అర్థాలు, భావం క్రింద వుంచాను.

ఈ పాటకు సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి, గానం: శ్రీకృష్ణ, ప్రియ సిస్టర్స్

పాటను వింటూ క్రింది సాహిత్యాన్ని (lyrics) చూడండి:

సాహిత్యం / చరణం కొన్ని పదాలకు అర్థాలు
అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి పాహి” యనఁ గుయ్యాలించి సంరంభి యై.
[ఈ పద్య భావం పైన వివరించబడింది]
అలా వైకుంఠపురములో..అడుగుమోపిందిపాశమే..
విలాపాలున్న విడిదికే.. కలాపం కదిలివచ్చెనే..అలా వైకుంఠపురములో..బంటుగాచేరెబంధమే..
అలై పొంగేటికళ్ళలో కులాసాతీసుకొచ్చెనే..
గొడుగుపట్టింది గగనమే..కదిలివస్తుంటె మేఘమే..
దిష్టితీసింది దీవెనై..ఘనకూష్మాండమే..
భుజము మార్చింది భువనమే..బరువుమోయంగ బంధమే..
స్వాగతించింది చిత్రమై..రవిసింధూరమే…వైకుంఠపురములో..
వైకుంఠపురములో..
వైకుంఠపురములో..
వైకుంఠపురములో..వైకుంఠపురములో..ఆ మూలనగరిలో..
వైకుంఠపురములో..సౌధంబుదాపల..
వైకుంఠపురములో..తారంగంచేరెనే..
వైకుంఠపురములో..తాండవమేసాగెనే..
అల = అక్కడ
పురంబు = పట్టణము
నగరి = రాజ భవన సముదాయము
మూల = ప్రధాన
సౌధంబు = మేడ {సౌధము – సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}
దాపల = దగ్గర
వన = తోట
అంతర = లోపల
ప్రాంత = సమీపమున గల
ఇందుకాంత = చంద్రకాంత శిల
ఉప = పైన
ఉత్పల = కలువల
పర్యంక = పాన్పుపై నున్న
రమా = లక్ష్మీదేవితో
వినోది = వినోదించు చున్న వాడు
అగున్ = అయిన
ఆపన్న = కష్టాలలో నున్న వారిని
ప్రసన్నుండు = అనుగ్రహించు వాడు
విహ్వల = విహ్వలము చెంది నట్టి {విహ్వలము – భయాదులచేత అవయవముల స్వాధీనము తప్పుట}
నాగేంద్రము = గజేంద్రుడు
పాహి పాహి = కాపాడు కాపాడు
అనన్ = అను
కుయ్యాలించి = మొర ఆలించి
సంరంభి = వేగిరపడు తున్న వాడు
ఐ = అయ్యి.
పాశము = తాడు
కూష్మాండం = గుమ్మడి
రవిసింధూరం = సూర్యుడినిపోలిన ఎరుపు రంగు
నారంగం = ??????
తాండవం = నృత్యం

 భావం (source: chaibisket):

రెండు చేతులు వాటంతట అవి కలవవు అన్నప్పుడు, ఒక తాడు ని తెచ్చి ఆ రెండు చేతులని కట్టేయాలి. అలా మనుషులని వాళ్లలో ఉన్న బంధాలని కట్టి ఒక చోట చేర్చే పాశంగా (తాడుగా) ఒక పాదం అడుగుమోపింది.
విలాపం (బాధలు, కష్టాలు) ఉన్న ఆ ఇంటికి కలాపం(చంద్రుడు, ఆనందం) లా అతను వస్తున్నాడు.

ఆ వైకుంఠపురం లో ఒక బంధం ఆ బంధాల విలువ తెలిసిన వ్యక్తి బంటు గా చేరుతున్నాడు.
కన్నీళ్లతో నిండిన ఆ కళ్ళలో కులాసా(ఆనందం, ప్రశాంతత) ని నింపడానికి వస్తున్నాడు.

ఒక పెద్ద ఆకాశం అతను ఒక మేఘమే కావచ్చు, కానీ అతనికి ఆ ఆకాశం గొడుగుపెట్టి (support chesthu) స్వాగతిస్తోంది..
కూష్మాండం (గుమ్మడికాయ) తో , గుమ్మడికాయతో దిష్టి తీశారు అతనికి..

పల్లకి మోస్తున్నప్పుడు బోయీలు భుజాన్ని మారుస్తుంటారు.. అలా భూమి భుజాన్ని మారుస్తోంది. కొన్ని బంధాలు, బరువుని మోస్తుంటే..
రవి కాంతి నుండి వస్తున్న సింధూర వర్ణం కూడా అతనికి స్వాగతం పలుకుతోంది…

ఇన్ని మంచి శకునాల (signs) మధ్య ఆ వైకుంఠపురంలో, అక్కడెక్కడో ఉన్న ఆ భవనం లోకి
తారంగం చేసే కృష్ణుడిలా, తాండవం ఆడే శివుడిలా అతను వచ్చాడు…

Leave a Reply